
తెలుగు సినీ ప్రపంచంలో ఘట్టమనేని కుటుంబానికున్న క్రేజ్, లెగసీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ నెలకొల్పిన ఆ ఘనమైన సామ్రాజ్యం నుంచి, మహేష్ బాబు సాధించిన తిరుగులేని విజయం తర్వాత, ఇప్పుడు ఆ నటవంశం నుంచి మూడో తరం వారసుడిగా ఘట్టమనేని జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నారు.
కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ, అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో జూలై 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన జయకృష్ణ.. ఈ చిత్రం కేవలం ఒక సినిమా విడుదల మాత్రమే కాదని, తమ కుటుంబానికి ఇది 10 ఏళ్ల సుదీర్ఘమైన నిరీక్షణ, నెరవేరిన పెద్ద కల అని భావోద్వేగంతో వెల్లడించారు.
కథానాయకుడిగా పరిచయం కావడానికి ముందు జయకృష్ణ విదేశాల్లో అత్యంత కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రముఖ 'లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్'లో దాదాపు 2 సంవత్సరాల పాటు ఉంటూ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. అక్కడ పలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కెమెరాను ఫేస్ చేయడంపై పూర్తి కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు. కేవలం నటన మాత్రమే కాకుండా, గత 10 ఏళ్లుగా టాకోండో, కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ వంటి మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతరం శిక్షణ పొందుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్, ముంబై నగరాల్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక పరిపూర్ణమైన నటుడిగా రూపుదిద్దుకున్నారు.
పరిశ్రమలోకి వచ్చే క్రమంలో బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన సలహాలు తనకు ఎంతో మార్గదర్శకంగా నిలిచాయని జయకృష్ణ తెలిపారు. "సినిమా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు, బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఎవరూ చూడరు" అని మహేష్ బాబు స్పష్టంగా చెప్పారని, అందుకే 100 శాతం ఫోకస్‌తో, ప్రాపర్ ప్రిపరేషన్‌తో మాత్రమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సూచించారని అన్నారు.
అలాగే 2022లో తండ్రి రమేష్ బాబు మరణించిన సమయంలో ఏర్పడిన శూన్యంలో, తాతగారు కృష్ణ గారు తనను దగ్గరకు తీసి కూర్చోబెట్టి ఇచ్చిన ధైర్యమే ఈరోజు తాను హీరోగా నిలబడటానికి ప్రధాన కారణమని గుర్తుచేసుకున్నారు.
'శ్రీనివాస మంగాపురం' చిత్రం షూటింగ్ విషయంలో కూడా బృందం ఎంతో పక్కాగా వ్యవహరించింది. మొత్తం 93 రోజుల పాటు షూటింగ్ జరిపి, కేవలం 6 నెలల వ్యవధిలోనే అనగా నవంబర్ చివర్లో ప్రారంభించి మే నాటికి సినిమాను పూర్తి చేశారు. ఏ సెట్లు వేయకుండా తిరుపతి పరిసర ప్రాంతాలు, పులిగుండు పర్వత ప్రాంతం వంటి 100 శాతం రియల్ లైవ్ లొకేషన్లలోనే పాటలు, ఫైట్లను చిత్రీకరించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలసి 15 నుండి 20 రోజుల పాటు కీలక సన్నివేశాల్లో నటించానని, తమ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు.
ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన 6 అద్భుతమైన పాటలు కథలోని భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించాయి. స్వతహాగా సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండే జయకృష్ణ, తన దృష్టినంతా నటనపైనే కేంద్రీకరిస్తున్నారు.
బుర్రిపాలెం ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి ఏటా కనీసం ఒక్కసారైనా బుర్రిపాలెం వెళ్తానని మాటిచ్చారు. శ్రీనివాస మంగాపురంలో మంగను ప్రేమించే అల్లరి కుర్రాడిగా, యాక్షన్ లవ్ స్టోరీతో అలరించబోతున్న జయకృష్ణ జూలై 30న బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ఘన విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Srinivasa Mangapuram, Ghattamaneni Jaya Krishna, Interview, TeluguOne




