
బాలీవుడ్ ప్రముఖ చలనచిత్ర దర్శకులు, నిర్మాతలు అయిన జోయా అక్తర్, రీమా కాగ్తీలకు ఊహించని భారీ షాక్ తగిలింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న వారి ప్రముఖ నిర్మాణ సంస్థ 'టైగర్ బేబీ డిజిటల్ ఎల్‌ఎల్‌పీ' (Tiger Baby) కార్యాలయంలో అత్యంత విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్‌లు భారీ ఎత్తున దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘోర డేటా చోరీ ఉదంతం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇంకా విడుదల కాని సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పెద్ద పెద్ద బ్రాండ్‌లకు సంబంధించిన యాడ్ షూట్స్ వంటి అత్యంత రహస్యమైన డిజిటల్ ఫుటేజ్ ఉన్న ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు ఆఫీస్ నుండి మాయమవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హార్డ్ డిస్క్‌ల మార్కెట్ విలువే సుమారు 13 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వాటిలో భద్రపరిచిన ఒరిజినల్ డేటా గనుక బయటకు లీక్ అయితే, ఆ నష్టం వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ విస్తుపోయే దొంగతనం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంస్థలో మొత్తం 119 హార్డ్ డిస్క్‌ల ఇన్వెంటరీ ఉండగా, అందులో 66 డిస్క్‌లు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ సాదాసీదా స్టోరేజ్ డివైజ్‌లు కావు, వీటి సామర్థ్యం ఒక్కొక్కటి 16TB నుండి ఏకంగా 72TB వరకు ఉంటుంది. ఈ భారీ స్టోరేజ్ డిస్క్‌లలో షూటింగ్‌కు సంబంధించిన రా ఫుటేజ్, రఫ్ ఎడిట్స్, సీన్ కట్స్, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్స్ , గతంలో ఘనవిజయం సాధించిన ప్రాజెక్టుల తాలూకు బ్యాకప్ డేటా భద్రపరిచారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'ఘోస్ట్ స్టోరీస్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఫైల్స్ ఉన్నాయి. అయితే, ఆఫీస్ క్యాబినెట్‌లో భద్రంగా ఉండాల్సిన ఈ డిస్క్‌లను మాయం చేసి, యాజమాన్యానికి అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు వాటి స్థానంలో ఖాళీగా ఉన్న బాక్సులని, కొన్ని పాడైపోయిన డబ్బాలని ఉంచడం గమనార్హం.
ఈ దొంగతనం ఉదంతం మే 21వ తేదీన వెలుగులోకి వచ్చింది. ఆఫీస్ సిబ్బంది తమ రొటీన్ వర్క్ కోసం ఒక నిర్దిష్ట హార్డ్ డిస్క్‌ని వెతకగా అది దొరకలేదు. దాంతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మరియు హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ అయిన మెహజబీన్ ముస్తాక్ షేక్ ఆఫీస్ కప్‌బోర్డులను నిశితంగా పరిశీలించారు. అక్కడ కొన్ని బాక్సులు పాడైపోయి, లోపల డిస్క్‌లు లేకపోవడాన్ని గమనించి ఆమె వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అంతర్గత విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ ఘోరానికి పాల్పడింది మరెవరో కాదు, గత ఏడేళ్లుగా అదే ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తూ, ఆ స్టోరేజ్ క్యాబినెట్‌ను పర్యవేక్షించే ఆఫీస్ బాయ్ మహ్మద్ షాహిద్ అజీమ్ ఖాన్ అని తేలింది. ఈ ఇంటిదొంగ గత ఐదు నెలల కాలంలో ఎవరికీ అనుమానం రాకుండా విడతల వారీగా 24 హార్డ్ డిస్క్‌లను దొంగిలించి గ్రే మార్కెట్‌లో అమ్మేసుకున్నట్లు అంగీకరించాడు.
Also read: మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్
బోరివలికి చెందిన రితేష్ సురేష్ షా అనే స్టేషనరీ షాప్ వ్యాపారికి ఒక్కో హార్డ్ డిస్క్‌ను కేవలం 15,000 నుండి 20,000 రూపాయల మధ్య తక్కువ ధరకే విక్రయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టు ద్వారా మే 29 వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం దొంగిలించబడిన 66 డిస్క్‌లలో 24 డిస్క్‌ల వివరాలు లభ్యమవగా, మిగిలిన 42 హార్డ్ డిస్క్‌లు ఎక్కడ ఉన్నాయనే దానిపై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, ఈ కేసులో హార్డ్‌వేర్ రికవరీ కంటే కూడా అందులోని అత్యంత రహస్యమైన, అన్‌రిలీజ్డ్ సినిమా కంటెంట్‌ను నిందితులు ఎక్కడైనా కాపీ చేశారా, లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎవరికైనా విక్రయించి లీక్ చేశారా అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు చాలా నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ యుగంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో డేటా సెక్యూరిటీ ఎంత ప్రాణాధారమైనదో ఈ ఘటన మరోసారి నిరూపించింది.






