
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఆయన హీరోగా విఘ్నేష్ రాజా (Vignesh Raja) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కర'. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించాల్సి ఉందని ఆ మధ్య వార్తలు బలంగా వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా దర్శకుడు విఘ్నేష్ రాజా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పృథ్వీరాజ్ నో చెప్పడానికి కారణం?
'కర' సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తాను సంప్రదించిన మాట వాస్తవమేనని దర్శకుడు విఘ్నేష్ రాజా తెలిపారు. అయితే అది హీరో పాత్ర కోసం కాదని, ఇందులోని మరో కీలక పాత్ర కోసమని స్పష్టం చేశారు.
"నా గత చిత్రం 'పొర్ తమిళ్' చూసిన తర్వాత పృథ్వీరాజ్ నన్ను అభినందించారు. ఆ పరిచయంతోనే 'కర' స్క్రిప్ట్‌లోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయన్ని కలిశాను. కథ విన్న పృథ్వీరాజ్, కంటెంట్ చాలా బాగుందని, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మెచ్చుకున్నారు. కానీ, ఆ పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుందని, అది తనకు సెట్ కాదని భావించి సున్నితంగా తిరస్కరించారు" అని విఘ్నేష్ వివరించారు.

పాత్రలో మార్పులు.. సూరజ్ ఎంట్రీ:
పృథ్వీరాజ్ మాత్రమే కాకుండా, మరికొందరు నటులు కూడా అదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో విఘ్నేష్ రాజా ఆ పాత్రపై తిరిగి కసరత్తు చేశారు. క్యారెక్టరైజేషన్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాత మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడును సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రంలో సూరజ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. 1991 నాటి నేపథ్యంతో సాగే ఈ కథలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ధనుష్ మార్క్ యాక్షన్, విఘ్నేష్ రాజా మేకింగ్ స్టైల్ తోడవ్వడంతో 'కర'పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఏప్రిల్ 30న తెలుగులోనూ విడుదల కానుంది.






