- వెంకీ అట్లూరి మార్క్ మ్యాజిక్..
- టీజర్ అదిరిపోయిందిగా!
- మమితా బైజు క్యూట్‌నెస్, సూర్య మెచ్యూర్డ్ లుక్
- ఆకట్టుకుంటున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్
- జూలైలో థియేటర్లకి.. టీజర్‌తో పెరిగిన అంచనాలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ల జోరు పెంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విభిన్నమైన కథాంశంతో, ఎమోషనల్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ కలబోసి రూపొందించిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ టీజర్‌లో సూర్య 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ 'సంజయ్ విశ్వనాథ్' పాత్రలో కనిపిస్తున్నారు. ఎన్నో మెడల్స్ సాధించినా, తనకంటూ కొన్ని లక్ష్యాలతో సాగే మధ్య వయస్కుడిగా సూర్య లుక్ చాలా కొత్తగా ఉంది. ఇక 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు ఈ చిత్రంలో 20 ఏళ్ల అమ్మాయిగా, సూర్యను గాఢంగా ప్రేమించే పాత్రలో మెరిసింది. 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే ఈ ఆసక్తికర ప్రేమాయణమే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ముఖ్యంగా సూర్య, మమితల మధ్య సాగే సంభాషణలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. "నువ్వు చిటికేస్తే చాలామంది అబ్బాయిలు పడతారు" అని సూర్య అంటే, "కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు వేస్తా.. నువ్వు పడు చాలు" అని మమితా ఇచ్చే రిప్లై టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. వయసు వ్యత్యాసం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య లవ్ స్టోరీని వెంకీ అట్లూరి తనదైన శైలిలో చాలా హుందాగా, ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.
డైరెక్టర్ వెంకీ అట్లూరి గతంలో ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి సూర్య లాంటి వెర్సటైల్ నటుడితో కలిసి పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సూర్య తల్లిగా నటిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిమిష్ రవి విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మమితా బైజు తెలుగు, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. సూర్య కెరీర్‌లో ఇది మరో విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.





.webp)

