
రచయితకి స్టార్ డమ్ తెచ్చిన విజయేంద్ర ప్రసాద్ దాదాపు నాలుగున్నర దశాబ్దాలపై నుంచే రచయితగా కొనసాగుతూ వస్తున్నారు. తన కొడుకు దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్' తప్ప మిగతా అన్నిచిత్రాలకి కథని అందిస్తూ పాన్ ఇండియా లెవల్లో తెలుగోడి సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం 'వారణాసి'తో బిజీగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ప్రశ్న పత్రాల లీకేజ్ కాకుండా ఉండటానికి కొన్ని మార్గాలని సూచించారు.
ఆయన మాట్లాడుతు ప్రశ్నాపత్రాల తయారీకి, పరీక్ష నిర్వహణకు మధ్య ఉండే సుదీర్ఘమైన సమయ వ్యత్యాసమే లీకేజీల దందాకి ప్రధాన మూలకారణంగా మారుతోంది. ప్రశ్నపత్రం రూపొందించడం దగ్గర నుండి అది ప్రింటింగ్ అవ్వడం, బైండింగ్, స్టోరేజ్, చివరికి పరీక్షా కేంద్రాలకు చేరే వరకు అనేక దశలు ఉంటాయి. ఈ ప్రక్రియల మధ్య చాలా సమయం ఉండటం వల్ల, ఏ స్థాయిలోనైనా కేటుగాళ్లు చొరబడి లీకేజీలకు పాల్పడే అవకాశం లభిస్తోం ది.విద్యార్థులు పరీక్ష హాలులోకి వెళ్లే వరకు అసలు ఫైనల్ ప్రశ్నాపత్రం రూపుదిద్దుకోకుండా ఉండే సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీనికి ఏకైక పరిష్కారం.
ప్రతి సబ్జెక్టుకి సంబంధించి వేలాది ప్రశ్నలతో కూడిన ఒక భారీ క్వశ్చన్ బ్యాంక్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు నీట్ పరీక్షలోనే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఒక్కో దాంట్లో 45 ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ నుండి కంప్యూటర్ ద్వారా రాండమ్‌గా ప్రశ్నలను ఎంపిక చేసే విధానం తీసుకురావాలి. ఉదయం 8:00 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకుని, తమ వద్ద ఉన్న ఫోన్లు, స్టడీ మెటీరియల్స్ అన్నింటినీ దాచేసి సీట్లలో కూర్చున్న తర్వాత, సరిగ్గా 8:10 గంటలకు కంప్యూటర్ సహాయంతో ఆటోమేటిక్‌గా క్వశ్చన్ పేపర్ జనరేట్ అవ్వాలి. ఆ తర్వాత 8:55 గంటల సమయంలో ఎన్‌క్రిప్ట్ చేసిన ఆ ఫైల్‌ను టైమ్ లాక్ సాంకేతికతతో పరీక్షా కేంద్రాల్లోని సిస్టమ్‌లకు పంపిస్తే, సరిగ్గా 9:00 గంటలకు అభ్యర్థుల స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
Also read: అంతా ఆ మహానుభావుడి దయ వల్లనే.. సినిమాలు లేకపోవడంపై #సురేష్ కీలక వ్యాఖ్యలు
ఈ విధానం ద్వారా పేపర్ ప్రింట్ చేయడం, దాచడం వంటి మానవ ప్రమేయం పూర్తిగా తగ్గిపోయి, పేపర్ లీకేజీకి 0% అవకాశం ఉంటుందని వివరించారు. సోషల్ మీడియాలో ఆ మాటలు వైరల్ కావడంతో 'పార్లమెంట్ వేదికగా మీరు చెప్పిన అంశాన్ని గట్టిగా లేవనెత్తి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు నెటిజన్లు, విశ్లేషకులు కోరుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ బిజెపి తరుపున రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
vijayendra prasad, Rajamouli






