.webp)
టాలీవుడ్ లో పండగ సీజన్ అంటేనే భారీ మల్టీస్టారర్ల హంగామా మొదలవుతుంది. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో 'హిట్ మెషిన్'గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి సరికొత్త క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ తాజా చిత్రం (#VenkyAnil5 & #NkrAR2) అత్యంత ఘనంగా ప్రారంభమైంది. రాబోయే 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా, పూజా కార్యక్రమాలతో సరికొత్త రికార్డుల వేటకు శ్రీకారం చుట్టింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పిస్తుండగా, జీ స్టూడియోస్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఈ సినిమా గ్రాండ్ ముహూర్తం వేడుక టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటికి అధికారికంగా అందజేసి సినిమా పనులను ప్రారంభించారు. ముహూర్తం షాట్ విషయానికొస్తే, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. మరో అగ్ర నిర్మాత సురేష్ బాబు కెమెరా ఆన్ చేయగా, లెజెండరీ దర్శకులు కె. రాఘవేంద్రరావు ముహూర్తం షాట్‌కు దర్శకత్వం వహించడం విశేషం.
అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో 100 శాతం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఇదివరకే వెంకటేష్‌తో కలిసి ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న అనిల్ రావిపూడికి, వెంకీతో ఇది 5వ కొలాబరేషన్ కావడం విశేషం. అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మైల్‌స్టోన్ లాంటి 'పటాస్' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 2వ సినిమా ఇది. అటు నందమూరి అభిమానులు, ఇటు దగ్గుబాటి అభిమానులు ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్‌పై పండగ పూట చూడబోతుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టిలు కథానాయికలుగా నటిస్తుండటం సినిమాకు మరింత గ్లామర్ మోసుకొచ్చింది.
జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ఒక ప్రత్యేక మ్యూజికల్ ప్రోమోలో దిగ్గజ దర్శకుడు జంధ్యాల గారి 'అహ నా పెళ్ళంట' సినిమాలోని ఐకానిక్ ఇసుక సీన్‌ను అనిల్ రావిపూడి తనదైన శైలిలో రీక్రియేట్ చేసి జి.వి. ప్రకాష్‌ను పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, నాన్‌స్టాప్ షెడ్యూల్స్ తో 2027 సంక్రాంతి పండగ బరిలో నిలవడానికి పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.





