'గని'తో ఇటు ఇమేజ్, అటు ఫ్యాన్ బేస్ పెంచుకోబోతున్న వరుణ్ తేజ్!
on Aug 5, 2021
ఏడేళ్ల కాలంలో వరుణ్ తేజ్ నటించిన 9 సినిమాలు విడుదలయ్యాయి. దేనికదే భిన్నమైన కథాంశంతో, పాత్రలతో వరుణ్ తనను తాను ఆవిష్కరించుకున్నాడు. నటునిగా విలక్షణతను ప్రదర్శించాడు. ఫ్యామిలీ మూవీ, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ, యాక్షన్ డ్రామా, సైన్స్ ఫిక్షన్, దేశభక్తి మేళవించిన ప్రేమకథ, ఔట్ అండ్ ఔట్ కామెడీ.. ఇన్ని రకాల సినిమాలను చేసేశాడు వరుణ్. అతని మునుపటి సినిమా 'గద్దలకొండ గణేష్'లో అయితే విలనిజాన్నీ చూపించేశాడు.
వరుణ్ యాక్షన్ హీరోగా చేసిన 'లోఫర్' మూవీ సరిగా ఆడలేదు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో మదర్ సెంటిమెంట్ ఉన్నా ఎందుచేతో ఆడియెన్స్ ఆదరించలేదు. కానీ యాక్టర్‌గా వరుణ్‌కు మంచి పేరే వచ్చింది. ఇప్పుడు మరోసారి యాక్షన్ జానర్లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా.. 'గని'. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో తయారవుతున్న ఈ మూవీలో ప్రత్యర్థులకు గట్టి పంచ్‌లు ఇచ్చే బాక్సర్‌గా కనిపించనున్నాడు వరుణ్.
కిరణ్ కొర్రపాటి అనే కొత్త డైరెక్టర్ వరుణ్‌ను ఇంతదాకా మనం చూడని క్యారెక్టర్లో చూపించబోతున్నాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో వరుణ్ చేసే హై-ఆక్టేన్ యాక్షన్ రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తాయని యూనిట్ మెంబర్స్ చెప్తున్నారు. ఈ సినిమాతో వరుణ్ ఇమేజ్, అతని ఫ్యాన్ బేస్ అనూహ్యంగా పెరుగుతాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యాక్టర్-డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలో ఉపేంద్ర, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, నదియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దీపావళికి గని సినిమాని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈరోజే ప్రకటించారు. సో.. దీపావళికి ఓవైపు పటాసులు పేలడం, ఇంకోవైపు 'గని' పంచ్‌లు బ్లాస్టవడం చూడొచ్చన్న మాటే!