
బాబాయ్, అబ్బాయ్.. తెలుగు చిత్రసీమలో ఈ ట్యాగ్ లైన్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. (Ntr)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan),మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)..ఆ ట్యాగ్ లైన్ క్రేజ్ కి ఇమేజ్ తెచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు గాయాలు పాలవ్వడంతో తెలుగు చిత్రసీమలో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎన్ని పనుల్లో ఉన్నా కూడా తమ హీరో హెల్త్ ఎలా ఉందనే ఆలోచన మాత్రం వాళ్ళ మస్తిష్కాల్లో నుంచి వెళ్లడం లేదు.
సాధారణంగా భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, నిరంతరం సాగే కఠినమైన షూటింగ్ షెడ్యూళ్లు, జిమ్‌లో చేసే హెవీ వర్కౌట్లు మరియు సుదీర్ఘ ప్రయాణాల కారణంగా నటులకు చిన్నపాటి దెబ్బలు తగలడం సహజమే. అయితే, ఈసారి మాత్రం నలుగురు అగ్ర స్టార్ హీరోలు దాదాపు ఒకే సమయంలో వేర్వేరు గాయాలతో చికిత్స పొందుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముందుగా మెగా కాంపౌండ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజం గాయంతో తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొంతకాలం నుంచి వేధిస్తున్న భుజం సమస్య తీవ్రమవ్వడంతో వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినప్పటికీ, పూర్తి విశ్రాంతి తీసుకోకుండానే పవన్ కళ్యాణ్ తన ప్రజా సంక్షేమ బాధ్యతలు, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓజి సిక్వెల్ గా స్టార్ట్ చేయాల్సి ఉంది. అబ్బాయి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు గాయంతో అభిమానుల్లో ఆందోళన రేకెత్తించారు. ఇటీవలే ఆయన తమిళనాడులోని కోయంబత్తూరులోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకున్నారు. వైద్యులు కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించడంతో చరణ్ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుకుమార్ తో చేస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ షూటింగ్ సెట్స్‌లో కొద్దిపాటి షెడ్యూల్ మార్పులు చేసి, త్వరలోనే తిరిగి చిత్రీకరణలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక నందమూరి కుటుంబంలో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న 'NBK111' సినిమా షూటింగ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి తీవ్రమైన గాయమైంది. వైద్యుల పరీక్షల అనంతరం ఆయన మోకాలికి సర్జరీ చేసి, కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బాలకృష్ణ వేగంగా కోలుకుంటున్నప్పటికీ, షూటింగ్‌కి తాత్కాలికంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది. దీనివల్ల ఈ ఏడాది డిసెంబర్ నెలలో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయాలని భావించిన నిర్మాతలు, రిలీజ్ డేట్ పై మళ్ళీ ఆలోచిస్తారనేది టాక్.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా భుజం గాయంతో బాధపడుతుండటం అభిమానులని మరింత విచారంలోకి నెట్టింది. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న షూటింగ్ కంటిన్యూగా జరగడం, కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం వల్లే ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడతారని సన్నిహిత వర్గాలు అధికారంగా లేఖ ఒకటి రిలీజ్ చేసారు. ఏది ఏమైనా పరిశ్రమని శాసించే నలుగురు టాప్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు గాయపడటంతో చిత్ర పరిశ్రమతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్ మూడ్ అయితే అప్ సెట్ లో ఉందనేది వాస్తవం. కొంత మంది వీరాభిమానులు అయితే దిష్టి ఏమైనా తలిగిలిందా అనే కామెంట్స్ చేస్తున్నారు.
Pawan Kalyan, Balakrishna, Ntr, Ram Charan






