
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) నుండి సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ది ఒడిస్సీ' (The Odyssey). తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్రీకు పురాణగాధ ఆధారంగా, నోలన్ మార్కు మేకింగ్‌తో తెరకెక్కిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు 'ఒడిస్సియస్' తన ఇంటికి చేరుకోవడానికి సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపించింది. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవుల మధ్య సాగే పోరాటాలు ప్రేక్షకులకు ఆస్కార్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి.
ట్రైలర్ లో యుద్ధం ముగిసిన తర్వాత తన భార్య, కొడుకు కోసం ఇంటికి తిరిగి వెళ్లాలనుకునే యోధుడి ప్రయాణాన్ని అత్యంత భావోద్వేగ భరితంగా చూపించారు. "నీకేం గుర్తున్నాయో చెప్పు" అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్, హీరో తన గతాన్ని, కుటుంబాన్ని గుర్తుచేసుకునే సీన్లతో ఆకట్టుకుంటుంది. ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులు, శత్రువుల కుట్రలు, ప్రకృతి విపత్తులను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా నోలన్ సినిమాల్లో ఉండే ఆ గంభీరమైన నేపథ్య సంగీతం ఈ ట్రైలర్‌లోనూ రోమాంచితంగా ఉంది.
"నాకు నా ఇంటికి మధ్య ఎవరూ నిలవలేరు.. చివరికి దేవుడితో సహా" అంటూ హీరో చెప్పే డైలాగ్ సినిమాలోని తీవ్రతను తెలియజేస్తోంది. తన కొడుకు, భార్య రక్షణ కోసం ఒక యోధుడు పడే తపన, శత్రువులతో చేసే యుద్ధం ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, నోలన్ సిగ్నేచర్ స్టైల్ విజువల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
మొత్తానికి, 'ది ఒడిస్సీ' ట్రైలర్ చూస్తుంటే నోలన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషన్స్ కలగలిసిన 'ది ఒడిస్సీ' చిత్రం వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.





