Home

»

Latest News

నేరుగా ఆహా వేదికగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పేరు తెలిస్తే షాక్ అవుతారు

Jun 16, 2026 12:08PM

 

చిన్న చిత్రమే అనుకోని లైట్ గా తీసుకున్నామా! చాలా పొరపాటు అవుతుంది. ఈ విషయం సినీ ప్రేమికులకి బాగా తెలుసు. ఆకట్టుకునే కథ, పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉంటే చాలు మన మనసుల్లో నుంచి సదరు చిత్రం అంత త్వరగా వెళ్లిపోదు. ఈ కోవలోనే    తెలుగు ఓటీటీ రంగంలో వినూత్నమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ 'ఆహా' మరో సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డిజిటల్ స్క్రీన్స్ పైకి తీసుకురావడానికి సిద్ధమైంది. 

'ఓ.. పిట్టకథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో', 'రేపు ఉదయం పది గంటలకి ' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించాడు.పేరు  'థాంక్యూ సుబ్బారావు'(Thank you subbarao). ప్రముఖ నిర్మాత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో 'కుర్ర ప్రొడక్షన్స్' బ్యానర్‌పై దినేష్ కుర్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేట్రికల్ రిలీజ్ కాకుండా, ఈ చిత్రం నేరుగా డిజిటల్ వేదికపై జూన్ 18వ తేదీ నుండి వరల్డ్ ప్రీమియర్‌గా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్‌కి  సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కథాంశం మొత్తం ఒక ప్యాసింజర్ రైలు ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. ఊరు, పేరు, కనీసం ముఖం కూడా తెలియని ఒక అపరిచిత అమ్మాయి చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన క్రైమ్ మిస్టరీతో ఈ చిత్రాన్ని మలిచారు. రైలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, ఊహించని మలుపులు ప్రేక్షకులలో అమితమైన క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. 

 చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి మరియు మురళీధర్ గౌడ్ కీ రోల్స్ లో  కనిపించనున్నారు. కామెడీగా స్టార్ట్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా క్రైమ్ సస్పెన్స్ మిస్టరీగా టర్న్ తీసుకుంటుంది. ట్రైలర్ లోని డైలాగ్స్ ప్రకారం.. ఇప్పటికే 6 గురు అమ్మాయిలను ఎవరో దారుణంగా హత్య చేశారని హీరో హీరోయిన్లతో ఒక వ్యక్తి చెప్పే డైలాగ్ ఈ కథలోని లోతుని తెలియజేస్తోంది. డ్రగ్స్‌కు బానిసలు అయిన కొంతమంది కుర్రాళ్లు రైలులో కనిపించే అమాయకపు అమ్మాయిలని  ఎత్తుకెళ్లి చంపేస్తున్నట్లుగా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథ నడుస్తుందని స్పష్టమవుతోంది. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను సమానంగా జోడించి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. 

Also read: Chiranjeevi: చిరు ఫ్యాన్స్‌లో మొదలైన ఆందోళన.. ఆ ఒక్క  ఆప్ష‌న్ మాత్ర‌మే మిగిలి ఉందా! 

 ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందించగా, పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. అలాగే డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఒక వైవిధ్యమైన సబ్జెక్ట్ మరియు బలమైన కంటెంట్‌తో వస్తున్న 'థాంక్యూ సుబ్బారావు' మూవీ కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులకి  ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. సస్పెన్స్ సినిమాలని ఇష్టపడే వారికి జూన్ 18 నుండి ఆహాలో ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com