
- తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్
- 13 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి సమాధానం ఈ గెలుపు
- నాడు సీఎం ఇంటి ముందు.. నేడు సీఎం కుర్చీ మీద..
వెండితెరపై హీరోలు ప్రతీకారం తీర్చుకోవడం మనం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో, అది కూడా రాజకీయ రణరంగంలో ఒక స్టార్ హీరో తనకి జరిగిన అవమానానికి 13 ఏళ్ల తర్వాత బదులు తీర్చుకోవడం అనేది అరుదైన విషయం. తమిళ సినీ ఇండస్ట్రీలో 'దళపతి'గా వెలుగొందుతున్న విజయ్ (Thalapathy Vijay) ప్రస్థానంలో జయలలితతో సాగిన ఆ 'కోల్డ్ వార్' ఒక సంచలనం. ఒకప్పుడు ముఖ్యమంత్రి ఇంటి గేటు ముందు గంటల తరబడి నిలబడ్డ విజయ్, నేడు అదే గడ్డపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది.
ఇది 2013 నాటి మాట. విజయ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు 'తలైవా' సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ సినిమా పోస్టర్‌పై ఉన్న "Time to Lead" అనే చిన్న ట్యాగ్ లైన్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు ఆగ్రహం తెప్పించింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తే తన అధికారానికి ముప్పు పొంచి ఉందని భావించిన ఆమె, రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని సినిమా విడుదలను అడ్డుకున్నారు. బాంబు బెదిరింపుల సాకుతో థియేటర్ల వద్ద భయాందోళనలు సృష్టించి, విజయ్ ని రాజకీయంగా ఎదగకముందే అణచివేయాలని చూశారు.
సినిమా ఆగిపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో విజయ్ నేరుగా జయలలితను కలిసి వివరణ ఇచ్చేందుకు కొడనాడ్ ఎస్టేట్‌కు వెళ్లారు. తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో కలిసి వెళ్ళిన విజయ్‌ను జయలలిత కనీసం గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఒక స్టార్ హీరో అని చూడకుండా గంటల తరబడి ఎండలో బయటే నిలబెట్టారు. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా, కనీసం మాట్లాడేందుకు ఎవరినీ పంపలేదు. ఇది విజయ్‌కు మాత్రమే కాదు, మొత్తం సినీ రంగానికే జరిగిన అవమానంగా అభిమానులు భావిస్తారు.

జయలలిత అక్కడితో ఆగకుండా విజయ్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ట్యాక్స్ మినహాయింపులు కూడా నిరాకరించారు. గత్యంతరం లేని స్థితిలో విజయ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, "నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాను, దయచేసి మా సినిమాను విడుదల చేయనివ్వండి" అని ఎమోషనల్ అయ్యారు. ఒక మాస్ హీరో అలా దీనస్థితిలో వేడుకోవడం తమిళనాడు ప్రజలను కలిచివేసింది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2013లో ఏ గేటు బయట అయితే విజయ్‌ను నిలబెట్టారో, నేడు అదే తమిళనాడు ప్రజలు అసెంబ్లీ గేట్లు తెరిచి ఆయనను ఆహ్వానిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో విజయ్ తన సొంత పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) తో సంచలనం సృష్టించారు. 2026 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన విజయ్.. జయలలిత వారసత్వ పార్టీ అయిన అన్నా డీఎంకేను మూడో స్థానానికి పరిమితం చేయడమే కాకుండా, ఏకంగా 108 సీట్లు గెలిచి సరికొత్త చరిత్ర లిఖించారు. త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఓట్ల గెలుపు మాత్రమే కాదు, అది 13 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి కాలం ఇచ్చిన సమాధానం. నాడు ఒక ముఖ్యమంత్రి ముందు నిస్సహాయంగా నిలబడ్డ వ్యక్తి, నేడు ప్రజల మద్దతుతో అదే ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నాడు.






