Home

»

Latest News

సీనియర్ నటీమణి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స

Aug 20, 2026 9:38AM

 

 

'పాండవులే పాండవులే తుమ్మెద' అంటూ తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా ముద్రపడిన సీనియర్ నటి  షావుకారు జానకి. పద్మశ్రీ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలని అందుకున్న జానకి గారు  కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు. దాంతో కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం చెన్నైలోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి కావేరిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

నిన్న రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, వైద్యులు తక్షణమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) కు తరలించి ప్రత్యేక పర్యవేక్షణలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రాథమికంగా వెల్లడించినప్పటికీ, ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలతో కూడిన అధికారిక హెల్త్ బులిటెన్ వెలువడాల్సి ఉంది. 

నాటకరంగంలో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి, వివాహం తర్వాత చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1949లో ఎన్టీఆర్ సరసన  'షావుకారు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేయగా,  ఆ సినిమా సాధించిన విజయం కారణంగా తన ఇంటిపేరునే 'షావుకారు జానకి'గా మార్చుకుని సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయారు.  ఆ మూవీ అప్పడు ఆమె వయసు పంతొమ్మిది సంవత్సరాలు.  కళాత్మక నటనకు చిరునామాగా నిలిచిన ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎంజిఆర్, రాజ్‌కుమార్‌ వంటి అగ్ర హీరోలతో జత కట్టి  తొలి పాన్ ఇండియా నటీమణులలో ఒకరిగా ప్రత్యేక ముద్ర వేశారు. 400 కి పైగా చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆమె విశిష్ట సేవా నిరతికి గుర్తించి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో గౌరవించింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ మహానటి ఆస్పత్రి పాలయ్యారనే వార్త తెలియగానే టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మహానటి త్వరగా కోలుకుని తమ ముందుకు రావాలని  సోషల్ మీడియా వేదికగా సినీ రంగానికి చెందిన నటీనటులు, రాజకీయ ప్రముఖులు మరియు లక్షలాది మంది అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.  జానకి గారి వయసు  95 సంవత్సరాలు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి. పూర్తి పేరు టేకుమళ్ల  జానకి కాగా  అలనాటి అగ్ర హీరోయిన్ కృష్ణ కుమారి ఈమె సోదరినే. 

Sowcar Janaki, Ntr, Anr, Mgr

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com