యాక్టర్ కాకముందు హోటల్ బిజినెస్ చేసిన శరత్‌బాబు!
on May 2, 2021
తెలుగువాడైన శరత్‌బాబు బహుభాషా నటుడు. దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ నటించిన ఆయన 300కు పైగా సినిమాలు చేశారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన సినీ ప్రయాణం సాగింది. మొదట్లో ఆశించిన రీతిలో కెరీర్ సాగలేదు. ఎప్పుడైతే లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ దృష్టిలో పడ్డారో, అప్పుడు ఆయన కెరీర్ టర్న్ తీసుకుంది.
శరత్‌బాబు 19 సంవత్సరాలకే డిగ్రీ పూర్తి చేశారు. మంచి ఒడ్డూ పొడుగూ ఉండటం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్‌లో పాల్గొంటూ ఉండటంతో పోలీసాఫీసర్ అవ్వాలనేది అప్పట్లో ఆయన ఆశయం. "నా హైట్‌కి నేను వెనక బెంచ్‌లో కూర్చొనేవాడిని. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి బ్లాక్ బోర్డ్‌లో లెక్చరర్స్ రాసేది ఔట్ ఫోకస్ అవడం మొదలుపెట్టింది. పోలీస్ జాబ్‌కి అది మైనస్ పాయింట్ అని తెలుసు. దాంతో అది కాదనుకున్నాను." అని ఓ ఇంటర్వ్యూలో శరత్‌బాబు చెప్పారు.
ఆయన తండ్రి హోటల్ రన్ చేసేవారు. "నేను డిగ్రీ పూర్తి చేయగానే, నాన్న ఆ బిజినెస్‌ను నన్ను చూసుకొమ్మని చెప్పారు. సరేనని ఆ బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టాను. కానీ, రెండు మూడు నెలలు గడిచేసరికి అది నాకు సరిపడే పని కాదని తెలిసిపోయింది. కాలేజీలో నాటికలు, నాటకాలు వేసేవాడిని. ప్రొఫెషనల్‌గా స్టేజ్ యాక్టర్‌ను కాను, అమెచ్యూర్ స్టేజ్ యాక్టర్‌నే. దాంతో యాక్టర్ కావాలనే ఆసక్తి కలిగింది. అట్లా సినిమాల్లోకి వచ్చాను." అని ఆయన తెలిపారు.
ఆయన మొదట నటించిన సినిమా సరిగా ఆడలేదు. "కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కెరీర్ ఒడిదుడుకుల్లో సాగుతుండగా, ఓ ఫంక్షన్లో బాలచందర్‌గారు నన్ను చూశారు. ఆయనా, సింగీతం శ్రీనివాసరావుగారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన నన్ను పిలిచి, తమిళ్ వచ్చా అనడిగారు. ఫర్లేదు అన్నా. ఏదైనా తమిళంలో చెప్పమన్నారు. నాకు తెలిసిందేదో చెప్పాను. ఇంత చాల్లే అన్నారు. ఆ తర్వాత రోజు బాలచందర్‌గారిని ఆయన ఆఫీసులో కలిశాను. అలా 'నిళల్ నిజమాగిరదు' సినిమాలో అవకాశం ఇచ్చారు. అది పెద్ద హిట్. ఆ తర్వాత నేను వెనుతిరిగి చూడాల్సిన అవసరం కలగలేదు." అని తన తొలినాటి అనుభవాన్ని చెప్పుకొచ్చారు శరత్ బాబు.
1978లో వచ్చిన 'నిళల్ నిజమాగిరదు' సినిమాలో హీరో కమల్ హాసన్ కాగా, ఆయన స్నేహితుడు వెంకటాచలం పాత్రను శరత్‌బాబు చేశారు. అది పూర్తి స్థాయి పాత్ర. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన పాత్ర.
Also Read