Home

»

Latest News

స్టార్‌డమ్ మత్తు వల్ల నాలో అహంకారం పెరిగింది.. త‌ప్పు ఒప్పుకున్న సామ్‌!

Jun 16, 2026 4:41PM

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుండి వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ, తాజాగా తన సినీ ప్రయాణం మరియు వ్యక్తిగత మార్పులపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు వరుస హిట్లతో వచ్చిన స్టార్‌డమ్ తనలో తెలియకుండానే అహాన్ని పెంచిందంటూ సామ్ ఓపెన్‌గా మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తన తదుపరి చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక సాధారణ చిన్న పట్టణం నుండి వచ్చి, వెండితెరపై ఇంతటి స్టార్‌డమ్ అందుకోవడం తనకు మొదట్లో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు తన పేరు పెట్టి అరుస్తుంటే ఆ మత్తులో పడిపోయానని, దాంతో ఓ దశలో సక్సెస్ అనే ఆటకు తాను పూర్తిగా దాసోహమయ్యానని సమంత అంగీకరించారు.

ఆ రోజుల్లో ఏడాదికి ఏకంగా ఐదు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపానని సామ్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో ఇండస్ట్రీలో అందరూ తనను ‘గోల్డెన్ లెగ్’ అని పిలవడం మొదలుపెట్టారని, ఆ ట్యాగ్‌ను నిలబెట్టుకోవాలనే ఒత్తిడిని తానే స్వయంగా పెంచుకున్నానని తెలిపారు. ఆ సమయంలో తనకు అసలు ముగింపే లేదని, ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాననే ఒక రకమైన అహంకారం తలకెెక్కిందని ఆమె నిజాయితీగా ఒప్పుకున్నారు.

అయితే 2022లో సమంత మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ ఆరోగ్య సమస్యల వల్ల బలవంతంగా తీసుకోవాల్సి వచ్చిన లాంగ్ బ్రేక్ తన జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత ఎమోషనల్ అయ్యారు. ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా ఏ నాటికైనా కెరీర్‌కు ముగింపు ఉంటుందనే చేదు నిజాన్ని ఆ విరామ సమయంలోనే గ్రహించానని, అందుకే సెకండ్ ఇన్నింగ్స్‌లో కొన్ని పాత అలవాట్లను, పద్ధతులను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

సమంత చేసిన ఈ బోల్డ్ అండ్ హానెస్ట్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్టార్ స్టేటస్‌లో ఉండి కూడా తన తప్పులను ఇంత ఓపెన్‌గా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలని, సామ్ మునుపటికంటే ఇప్పుడు మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మారిందంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. హెల్త్ బ్రేక్ తర్వాత ఆమె వెండితెరపై ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనున్న సినిమా ఇదే కావడంతో టాలీవుడ్‌లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రంతో సమంత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేయనుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com