"నటనలో నాకు నేనే ఇన్స్పిరేషన్".. మహేశ్ అన్నయ్య రమేశ్‌బాబు!
on May 17, 2021
"నటనలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?" అని మహేశ్‌ను అడగండి.. "ఇంకెవరు మా నాన్నగారే. ఆయన సినిమాలు చూసే నేను పెరిగాను." అని ఠక్కున జవాబిస్తారు. అదే వాళ్లన్న రమేశ్‌బాబుకు ఆ ప్రశ్న వెయ్యండి.. "నాకు నేనే ఇన్స్పిరేషన్" అని చెబుతారు. నిజమేనా? అని సందేహించాల్సిన పనిలేదు. ఆ మాట హీరోగా తన తొలి సినిమా విడుదలైనప్పుడే చెప్పారు. అప్పటి ప్రముఖ సినిమా మేగజైన్ విజయచిత్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆయనిచ్చిన సమాధానాలు ఆశ్చర్యకరంగానూ, విచిత్రంగానూ అనిపిస్తాయి.
రమేశ్‌బాబు 'సామ్రాట్' (1987) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. అంతకు ముందు టీనేజ్‌లో ఉండగా దాసరి నారాయణరావు ఆయన ప్రధాన పాత్రధారిగా 'నీడ' (1979) చిత్రాన్ని తీశారు. వి. మధుసూదనరావు డైరెక్ట్ చేసిన 'సామ్రాట్'లో హీరోయిన్గా అప్పటి సెన్సేషనల్ బాలీవుడ్ యాక్ట్రెస్ సోనమ్ నటించింది. ఆ సినిమా విడుదల తర్వాత రమేశ్‌బాబు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు రమేశ్ బాబు చెప్పిన సమాధానాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం...
మీరు హీరోగా నటించిన 'సామ్రాట్' చూసినప్పుడు ఎలా అనిపించింది?
రమేశ్: నేను ఆల్రెడీ 'నీడ' చిత్రం ద్వారా చిత్రపరిశ్రమకు నటుడిగా పరిచయమయ్యాను. అంచేత నటన నాకు కొత్తకాదు. అదీగాక, సినిమా షూటింగ్ జరిగేటప్పుడే చిత్రీకరించే ప్రతి సీన్ నాకు తెలుసు. ఆ సీన్ ఎలా ఉంది? నేనెలా చేస్తున్నాను? అనేది నాకు ముందుగానే తెలుసు. సినిమా పూర్తయ్యాక తెరమీద చూసినప్పుడు దర్శకుని సూచనల ప్రకారం నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అయ్యాను.
అంటే మీ నటన పట్ల మీకు పూర్తి సంతృప్తి కలిగిందంటారు?
రమేశ్: అంటే.. కొంతవరకు. భవిష్యత్తులో ఇంకా బాగా చెయ్యాలని ఆశ.
'సామ్రాట్'లో మీ నటన చూసి మీ నాన్నగారు ఏమన్నారు?
రమేశ్: అది మా నాన్నగారిని అడిగితే బాగుంటుంది.. అని నా ఉద్దేశం.
నటనలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
రమేశ్: నటనలో నాకు నేనే ఇన్స్పిరేషన్. వేరే ఎవ్వరూ లేరు.
మీరు చదువుకొనే రోజుల్లో ఏఏ గేమ్స్ ఆడేవారు?
రమేశ్: నేను ఆల్‌రౌండ్ చాంపియన్‌ను కాదు. కానీ అన్ని గేమ్స్ ఆడేవాడ్ని.
మీకు ఇష్టమైన గేమ్స్?
రమేశ్: అన్నీ ఇష్టమైనవే.
మీరు చూసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం?
రమేశ్: చాలా ఉన్నాయి. చెప్పడం కష్టం.
మీ నాన్నగారు కాకుండా మీరు అభిమానించే నటుడు?
రమేశ్: ఎవరు బాగా నటిస్తే వారు నా అభిమాన నటులే.
మీకు ఏ తరహా పాత్రలంటే ఇష్టం?
రమేశ్: అన్ని రకాల పాత్రలూ నాకిష్టమే. ఎన్నో రకాల పూలను ఫ్లవర్‌వాజ్‌లో పెట్టి, ఏ రంగు పువ్వంటే ఇష్టం? అనడిగితే చెప్పడం కష్టం.
హీరోగా రమేశ్‌బాబు కెరీర్ ఓ దశాబ్ద కాలమే కొనసాగింది. 1997లో తండ్రి కృష్ణతో కలిసి నటించిన 'ఎన్కౌంటర్' ఆయన చివరి చిత్రం. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పిన ఆయన తర్వాత నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు.