Home

»

Latest News

చిరంజీవి సినిమాకి పోటీగా రామ్‌గోపాల్‌వర్మ సినిమా రిలీజ్!

Mar 12, 2026

సాధారణంగా తెలుగు సినిమాల రిలీజ్‌ల విషయంలో దర్శకనిర్మాతలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో చిన్న సినిమాలను విడుదల చెయ్యాలంటే కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే తమ సినిమా ఎంత బాగా ఉన్నా.. పెద్ద హీరో సినిమా ముందు నిలబడదు అనే అభిప్రాయం వారికి ఉంటుంది. 

కొందరు దర్శకనిర్మాతలు మాత్రం తాము అనుకున్న డేట్‌కి సినిమా రిలీజ్ చేసేందుకు వెనుకాడరు. అలాంటి సందర్భాలు చాలా సార్లు వచ్చాయి. 2004లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్‌’ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేశారు. అదే రోజు రాజా, కమలిని ముఖర్జీ జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘ఆనంద్‌’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. అయితే రెండు సినిమాలూ పెద్ద విజయం సాధించాయి. 

ఇదే పరిస్థితి 1993లో ఒకసారి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రల్లో బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ‘మెకానిక్ అల్లుడు’ చిత్రాన్ని మే 27న విడుదల చేశారు. ఆరోజుల్లో సూపర్‌హిట్ అయిన సినిమాలు 50రోజులు, 100 రోజులు, సిల్వర్ జూబ్లీలు ఆడేవి. దాంతో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నెలరోజుల పాటు థియేటర్లు దొరికేవి కాదు. చిన్న సినిమాలను రిలీజ్ చేసేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. మెకానిక్ అల్లుడు రిలీజ్ అయి సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్ని సెంటర్స్‌లో 100 రోజులు కూడా ఆడింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 

మెకానిక్ అల్లుడు చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ‘మనీ’ చిత్రాన్ని రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధపడిపోయారు రామ్‌గోపాల్‌వర్మ. జె.డి.చక్రవర్తి, చిన్నా, జయసుధ, బ్రహ్మానందం, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి సినిమా రిలీజ్ అయి రెండు వారాలు కాగానే ‘మనీ’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి వర్మ నిర్ణయించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

చిరంజీవి సినిమా మంచి రన్నింగ్‌లో ఉండగా నీ సినిమా రిలీజ్ చెయ్యడం సరికాదు అని వర్మ శ్రేయోభిలాషులు హెచ్చరించారు. కానీ, తను అనుకున్న డేట్‌కే సినిమా రిలీజ్ చేస్తానని వర్మ పట్టుపట్టారు. ‘మనీ’ చిత్రంలో హీరోగా నటించిన జె.డి. కూడా ఆ టైమ్ రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదని వర్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే దానికి వర్మ చెప్పిన లాజిక్ విని జె.డి. ఆశ్చర్యపోయారు. ‘చిరంజీవి సినిమా థియేటర్‌లలో ఆడుతుండగానే మన సినిమా రిలీజ్ చేస్తున్నాం. మన సినిమా ఫ్లాప్ అయితే.. చిరంజీవి సినిమాకి పోటీగా రిలీజ్ చేస్తారా? వీళ్ళకు ఎంత కొవ్వు అనుకుంటారు. మన సినిమా సూపర్‌హిట్ అయిందనుకో.. చిరంజీవి సినిమా రన్నింగ్‌లో ఉన్నప్పటికీ బాగా ఆడింది అంటారు. మనకు మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది. నిర్మాతగా నేను, డైరెక్టర్‌గా శివనాగేశ్వరరావు, హీరోగా నువ్వు సెట్ అయిపోయినట్టే’ అన్నారు వర్మ. 

‘మనీ’ సినిమా రిలీజ్ అయి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలోని కథ, కామెడీ, ట్విస్టులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఖాన్ దాదాగా బ్రహ్మానందం అద్భుతమైన కామెడీని పండించారు. దీంతో రిపీట్ రన్స్ కూడా మొదలయ్యాయి. 55 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 3 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో నటించిన జె.డి., చిన్నా, బ్రహ్మానందం, జయసుధ, పరేష్ రావల్‌కు, డైరెక్టర్‌గా శివనాగేశ్వరరావుకు, నిర్మాతగా రామ్‌గోపాల్‌వర్మకు చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవి సినిమాకి పోటీగా వర్మ సినిమా రిలీజ్ అవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com