
తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్ 2025 వేదికపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనదైన శైలిలో భావోద్వేగంగా మాట్లాడుతూ, ఓ వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, మరోవైపు ఏపీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేశారు. (Gaddar Awards)
గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న ఆర్. నారాయణమూర్తి(R Narayana Murthy).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. 13 ఏళ్లు నంది అవార్డుల ఊసే లేదని, అటువంటిది సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి అవార్డులు ప్రకటించిన 'డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం' రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు.
ప్రజా గాయకుడు గద్దర్ గురించి మాట్లాడుతూ.. అన్నమయ్య, భక్త రామదాసుల తర్వాత అంతటి స్థాయిలో ప్రజల గొంతుకైన వ్యక్తి గద్దర్ అని నారాయణమూర్తి అన్నారు. అస్సాంలో భూపేన్ హజారికాను అక్కడి ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో, అదే రీతిలో గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో తనకు దివంగత నటుడు కాంతారావు పేరు మీద అవార్డు రావడంపై నారాయణమూర్తి ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన నటుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కాంతారావు అని గుర్తు చేసుకున్నారు. కాంతారావు అవార్డు అందుకోవడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి నారాయణమూర్తి ఒక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ దూసుకుపోతున్నారని, అదే విధంగా ఏపీలో కూడా నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. ఇండస్ట్రీ ఉనికిని కాపాడటానికి, కళాకారులను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, ఇదే వేదికపై చిరంజీవి(Chiranjeevi) కూడా చంద్రబాబుకి రిక్వెస్ట్ చేయడం విశేషం. తెలంగాణాలో గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నట్టుగా, సినీ కళాకారులను ప్రోత్సహిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వాలని కోరారు.
మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ అవార్డుల వేడుకలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో కూడా అవార్డులు ఇవ్వాలంటూ చంద్రబాబుకి సినీ ప్రముఖులు రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





