
-పెద్దికి వరుస షాక్ లు
-తాజాగా షాక్ ఇచ్చిన కులసంఘాలు
-అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
-సెన్సార్ అధికారులపై కూడా కేసు
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan),బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో తెరకెక్కిన 'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 292.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి 300 కోట్ల క్లబ్‌కి చేరువవుతోంది. ఒకవైపు వసూళ్ల వర్షం కురుస్తున్నప్పటికీ, పెద్ది చుట్టూ వివాదాలు మాత్రం ముసురుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే కథానాయిక జాన్వీ కపూర్ క్యారక్టర్ ని గ్లామరైజ్ చేయడంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. తాజాగా పెద్ది మరో అతిపెద్ద వివాదంలో చిక్కుకుంది. గిరిజన సంస్కృతిని, భావోద్వేగాలని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వివాదం ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా అధికారికంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సినిమాలోని వివాదాస్పద అంశాలపై గిరిజన సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'పెద్ది' చిత్రబృందంతో పాటు కేంద్ర సెన్సార్ బోర్డు అధికారులపై కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. సినిమాలో తమ ఆచారాలను, సంప్రదాయాలని తప్పుగా చూపించడమే కాకుండా, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొన్ని సంభాషణలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారులదే ఇందులో ప్రధాన తప్పు అని, అందుకే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తో పాటు సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
also read: Vrusha karma: వృషకర్మని భారీ మొత్తానికి దక్కించుకున్న అగ్ర సంస్థ.. చైతు కెరీర్ లోనే హయ్యస్ట్
జాన్వీ కపూర్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. సదరు వివాదాస్పద సన్నివేశాలని సవరిస్తున్నట్లు కూడా ప్రకటించాడు. ఇప్పుడు గిరిజన సంస్కృతికి సంబంధించిన అంశం కావడంతో ఈ వివాదం అంత తేలికగా సర్దుమణిగేలా కనిపించడం లేదు.






