
టాలెంటెడ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ విలేజ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా 'పాపం ప్రతాప్' (Papam Prathap). 'మసూద', 'పరేషాన్', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఈసారి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.
థియేటర్లలో ఏప్రిల్ 17న విడుదలైన 'పాపం ప్రతాప్' ప్రేక్షకుల నుంచి పరవాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఈటీవీ విన్ అధికారికంగా ప్రకరించింది.
కథాంశం
ప్రతాప్ (తిరువీర్) తన తండ్రి (అజయ్ ఘోష్) ఇష్టానికి వ్యతిరేకంగా తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లయిన మూడు రాత్రులకే ప్రతాప్‌లో ఏదో లోపం ఉందని ఆరోపిస్తూ బుజ్జమ్మ పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్ ఎదుర్కొంటున్న వింత సమస్య ఏమిటి? దానిని ప్రతాప్ ఎలా పరిష్కరించుకున్నాడు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఈ సినిమాలో అమాయకపు ప్రతాప్ పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ పండించిన కామెడీ ఆకట్టుకుంది. 1990ల కాలం నాటి పల్లెటూరి వాతావరణం, భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. తిరువీర్ నటన, గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వైవిధ్యమైన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు 'పాపం ప్రతాప్' ఒక మంచి వినోదాన్ని అందిస్తుంది. గ్రామీణ వాతావరణం, సహజసిద్ధమైన కామెడీతో కూడిన ఈ సినిమాను మే 7 నుంచి ఈటీవీ విన్ లో వీక్షించవచ్చు.






