'టక్ జగదీష్' ఎఫెక్ట్.. శివ నిర్వాణ నుండి మరో లవ్ స్టోరీ!
on Sep 25, 2021
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యారు శివ నిర్వాణ. మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్న ఆయన.. రెండో చిత్రంగా 'మజిలీ' చేశారు. నాగ చైతన్య హీరోగా రూపొందిన ఈ చిత్రం విజయాన్ని సాధించడమే కాకుండా.. దర్శకుడిగా శివకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక మూడో సినిమాను మళ్ళీ నానితో చేసిన ఆయన ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఇదిలా ఉంటే దర్శకుడిగా శివ తన నాలుగో సినిమా ఓ లవ్ స్టొరీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు.
మొదటి రెండు సినిమాలు(నిన్ను కోరి, మజిలీ) లవ్ స్టొరీలు చేసి డీసెంట్ హిట్స్ అందుకున్నారు శివ నిర్వాణ. అయితే మూడో సినిమా 'టక్ జగదీష్'కి మాత్రం రూట్ మార్చారు. కమర్షియల్ టచ్ తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో శివ నాలుగో సినిమాగా తనకు అచ్చొచ్చిన లవ్ స్టొరీనే చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఒక వీడియో ద్వారా తెలియజేశారు శివ.
వైజాగ్ బీచ్ నుండి శివ ఓ చిన్న సెల్ఫీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిన్ను కోరి, మజిలీ సినిమాలను ప్రేక్షకులు మనసుల్లోకి తీసుకున్నారని, ఆ స్ఫూర్తితో తన నాలుగో చిత్రంగా మరో ప్రేమకథను అందించబోతున్నానని శివ తెలిపారు. సముద్రం, కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో.. ఈ ప్రేమ కథ కూడా అంతే ఒరిజినల్ గా ఉంటుందని శివ వీడియోలో చెప్పుకొచ్చారు. మరి ఈ లవ్ స్టొరీలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.
Also Read