హ్యాట్రిక్ కొట్టిన `వింక్ బ్యూటీ`!
on Jul 31, 2021
ఒకే ఒక వైరల్ వీడియో క్లిప్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయింది ప్రియా ప్రకాశ్ వారియర్. తన డెబ్యూ మూవీ `ఒరు అడార్ లవ్` ప్రచారచిత్రంలో ఆమె కన్ను కొట్టిన విధానం.. యూట్యూబ్ ని షేక్ చేసింది. ప్రియని కాస్త `వింక్ బ్యూటీ`గా పాపులర్ చేసేంది. దాంతో.. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిన ఈ కేరళకుట్టికి.. మాతృభాషలోనే కాకుండా అన్యభాషల్లోనూ అవకాశాలు వరించాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మూడు సినిమాలతో సందడి చేసింది ప్రియ.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ప్రియ నటించిన సదరు మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ సినిమాలే.. `ఒరు అడార్ లవ్` (తెలుగులో `లవర్స్ డే`గా అనువాదమైంది), `చెక్`, `ఇష్క్`. మరీ ముఖ్యంగా.. తెలుగునాట మంచి అంచనాల నడుమ జనం ముందుకొచ్చిన `చెక్`, `ఇష్క్`.. ప్రియని తీవ్ర నిరాశపరిచాయి. `చెక్`తో పోల్చితే `ఇష్క్`లో ఆమె పాత్ర పరిధి ఎక్కువే అయినప్పటికీ.. ఇక్కడి వారి అభిరుచికి అనుగుణంగా సదరు రీమేక్ లేకపోవడంతో నెగెటివ్ రిజల్ట్ తప్పలేదు. మొత్తమ్మీద.. కన్ను కొట్టుడు సుందరి ప్రియా ప్రకాశ్ వారియర్.. ఫ్లాప్ ల పరంపరతో హ్యాట్రిక్ కొట్టిందన్నమాట.
ఈ నేపథ్యంలో.. రాబోయే `శ్రీదేవి బంగ్లా` (హిందీ), `విష్ణు ప్రియ` (కన్నడ)తో పాటు సందీప్ కిషన్ కాంబినేషన్ లో చేస్తున్న తెలుగు సినిమాపైనే ప్రియ ఆశలు పెట్టుకుంది. మరి.. కొత్త సినిమాలైనా ప్రియా ప్రకాశ్ వారియర్ ని సక్సెస్ ఫుల్ హీరోయిన్ చేస్తాయేమో చూడాలి.