వాట్ ఎ పిటీ.. నేనూ హీరోనే అని చెప్పుకోవాల్సి వచ్చిన రానా!
on Sep 21, 2021
మలయాళం హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగులో 'భీమ్లా నాయక్' టైటిల్‌తో రీమేక్ అవుతోంది. ఒరిజినల్లో ఇన్స్పెక్టర్ అయ్యప్పగా బిజూ మీనన్, మాజీ హవల్దార్ కోషిగా పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇద్దరికి ఇద్దరే అన్న రీతిలో యాక్టింగ్ దున్నేశారు. ఒకసారి రాత్రివేళ రోడ్డుమీద కారులో ఫూటుగా తాగి, మద్యం బాటిళ్లతో పోలీసులకు కోషి తారసపడ్డంతో మొదలైన గొడవ, 'అయ్యప్ప వర్సెస్ కోషి' వ్యక్తిగత గొడవగా మారి, ఎన్ని సమస్యలను సృష్టించిందనే కథ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా చూస్తే ఒరిజినల్‌లోనూ ఫేస్ టు ఫేస్ ఫైట్‌లో కోషి కంటే అయ్యప్పదే ఒక అడుగు పైచేయి.
తెలుగు రీమేక్‌లో అయ్యప్ప కాస్తా భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్), కోషి కాస్తా డానియల్ శేఖర్ (రానా)గా మారారు. రీమేక్ టైటిల్‌ను రెండు పాత్రలపై పెట్టకుండా కేవలం పవన్ కల్యాణ్ చేస్తున్న 'భీమ్లా నాయక్' పేరుమీదే పెట్టడంతో సోషల్ మీడియాలో దీనిపై రగడ మొదలైంది. పవన్ కోసం కథను ఒన్సైడెడ్గా మార్చేశారనీ, అందుకే టైటిల్‌ను ఆయన క్యారెక్టర్ పేరుమీదే పెట్టారంటూ అనేకమంది ట్రోల్ చేశారు. రానా క్యారెక్టర్‌ను నెగటివ్‌గా, భీమ్లా నాయక్ పాత్రతో పోలిస్తే తక్కువ నిడివితో మార్చేశారనీ పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
భీమ్లా నాయక్ క్యారెక్టర్ టీజర్ కానీ, ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కానీ పవన్ ఏ రేంజ్ హీరోగా కనిపించనున్నారో తెలియజేశాయి. ఒరిజినల్లో అయ్యప్పను ఇలా ఆకాశానికెత్తేసేలా పాటలేవీ ఉండవు. ఇగో అనేది మనిషిని ఎక్కడిదాకా తీసుకెళ్తుందనే విషయాన్ని రియలిస్టిగ్గా అందులో చూపించారు. ప్రతిభావంతుడైన దర్శకుడు సాగర్ చంద్ర రీమేక్‌ను స్వేచ్ఛగా తీశాడా, త్రివిక్రమ్ కనుసన్నల్లో అతను ఎలా చెబితే అలా చేశాడా అనేది తర్వాత మనకు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే సోమవారం రానా చేసిన క్యారెక్టర్ టీజర్‌ను 'బ్లిట్జ్ ఆఫ్ డానియల్ శేఖర్' పేరిట రిలీజ్ చేశారు. రానా క్యారెక్టర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఆ టీజర్ ద్వారా తెలిపారు. అయితే ఆ టీజర్లో రానా చెప్పిన డైలాగ్పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. భీమ్లా నాయక్ భార్య (నిత్యా మీనన్)తో మాట్లాడుతూ, "నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట. స్టేషన్లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెల్సా.. ధర్మేంద్ర.. హీరో.. హీరో" అని చెప్పాడు రానా. ఆ డైలాగ్‌కు, 'షోలే' సినిమాకు కనెక్షన్ పెట్టారు. 'షోలే'లో అంజాద్ ఖాన్ చేసిన విలన్ క్యారెక్టర్ పేరు గబ్బర్ సింగ్. ఆ సినిమాలో ధర్మేంద్ర ఓ హీరో. అట్లా.. నీ మొగుడు విలన్, నేను హీరో.. అనే అర్థంలో రానా ఆ డైలాగ్ చెప్పాడని మనం అర్థం చేసుకోవచ్చు.
కానీ బయట నడుస్తోన్న రానా విలన్ అనే టాక్‌కు టీజర్లో ఈ డైలాగ్‌తో చెక్ పెట్టాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈ టీజర్‌పై కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. 'భీమ్లా నాయక్'లో తాను విలన్‌ను కాదనీ, హీరోననీ రానా చెప్పుకోవాల్సి వచ్చిందనీ నెటిజన్స్ కామెడీగా కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో భీమ్లా నాయక్ (పవన్)తో డానియల్ శేఖర్ (రానా) బాగా తన్నులు తినే సీన్లు చాలా ఎఫెక్టివ్‌గా వచ్చాయనేది ఇన్సైడ్ టాక్. అందుకే టీజర్లో రానా చెప్పిన డైలాగ్ చూసి, 'పూర్ రానా!' అనుకుంటున్నారు.