Home

»

Latest News

మెగా కాంపౌండ్ కేరాఫ్ పీరియడ్‌ ఫిలిమ్స్‌

Mar 9, 2020 11:20AM

 

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం పీరియడ్‌ ఫిలిమ్స్‌ ట్రెండ్ న‌డుస్తోంది. బ‌డా స్టార్స్ నుంచి రైజింగ్ హీరోస్ వ‌ర‌కు అంద‌రి చూపు ఈ త‌ర‌హా చిత్రాల వైపు ఉంది. మ‌రీ ముఖ్యంగా.. మెగా కాంపౌండ్‌లో దాదాపు ప్ర‌తీ క‌థానాయ‌కుడు ఈ జాన‌ర్‌లో సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి 'సుప్రీమ్' హీరో సాయితేజ్ వ‌ర‌కు అంద‌రి చూపు పీరియడ్‌ ఫిల్మ్ వైపు ఉండ‌డం విశేషం. చ‌రిత్ర‌కు కొన్ని ఊహ‌జ‌నిత పాత్ర‌లు, ఘ‌ట్టాలు జోడించి రూపొందించే ఈ పీరియడ్‌ ఫిలిమ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చిరంజీవి, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్ న‌టించారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ ఈ త‌ర‌హా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అంతేకాదు.. ఇప్పుడు ఈ జాబితాలోనే సాయితేజ్ కూడా ఓ పీరియడ్‌ ఫిల్మ్ చేయ‌నున్నాడ‌ని టాక్.

2015లో వ‌చ్చిన చారిత్ర‌క చిత్రం 'రుద్ర‌మ‌దేవి'లో గోనా గ‌న్నారెడ్డిగా బ‌న్నీ ముఖ్య భూమిక పోషిస్తే.. అదే ఏడాది విడుద‌లైన మ‌రో పీరియడ్‌ ట‌చ్ మూవీ 'కంచె'లో వ‌రుణ్ న‌టించాడు. రెండో ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో వ‌రుణ్ సోల్జ‌ర్ పాత్ర‌లో క‌నిపించాడు. ఇక గ‌త ఏడాది జ‌నం ముందుకు వ‌చ్చిన 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా ద‌ర్శ‌న‌మిచ్చాడు చిరు.

అలాగే ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న మ‌రో పీరియడ్‌ ఫిల్మ్ 'ఆర్ ఆర్ ఆర్'లో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తుంటే.. పేరు నిర్ణ‌యించని క్రిష్ డైరెక్టోరియ‌ల్‌లో రాబిన్ హుడ్ త‌ర‌హా భూమిక‌లో ప‌వ‌న్ క‌నిపించ‌నున్నాడు. మొఘ‌లాయిల ప‌రిపాల‌నా కాలం నాటి వాతావ‌ర‌ణంతో ప‌వ‌న్ - క్రిష్ కాంబో మూవీ తెర‌కెక్కుతోంద‌ని టాక్. అలాగే శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌ల కాలం నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో సాయితేజ్ కూడా ఓ పీరియడ్‌ మూవీ చేయ‌బోతున్నాడ‌ని.. వీరు పోట్ల ఈ సినిమాని తీర్చిదిద్ద‌నున్నాడ‌ని కొద్దిరోజుల క్రితం క‌థ‌నాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రం క్లారిటీ వ‌స్తుంది.

మొత్త‌మ్మీద మెగా కాంపౌండ్‌లో పీరియడ్‌ ఫిలిమ్స్‌ ట్రెండ్ భ‌లేగా ఊపందుకుంటోంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ త‌ర‌హా చిత్రాలేవీ ఈ కాంపౌండ్ క‌థానాయ‌కుల‌కు వాణిజ్య‌ప‌రంగా పెద్దగా క‌ల‌సి రాలేదు. రాబోయే సినిమాలైనా అచ్చొస్తాయేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com