పాకిస్తాన్‌లో మహావతార్ నరసింహ.. విజయం మనదే!
on Dec 3, 2025
- భక్తి పారవశ్యంలో ముస్లిం భక్తులు
- అందరికీ షాక్ ఇచ్చిన మహావతార్ నరసింహ
- పాకిస్తాన్‌లోనూ జయకేతనం
2025లో విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమాలు, బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన సినిమాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి సినిమాల్లో 'మహావతార్ నరసింహ' ఒకటి. కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపిస్తుంటాయి. కానీ, ఇది ఒక యానిమేషన్ మూవీ. పైగా భక్తి ప్రధాన చిత్రం. మొదట ఈ సినిమాను కన్నడ భాషలో మాత్రమే విడుదల చేశారు. ఇతర భాషల్లో కూడా ఆదరణ లభిస్తుందన్న ఉద్దేశంతో తెలుగు, హిందీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. మేకర్స్ ఊహించినట్టుగానే అన్ని భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది 'మహావతార్ నరసింహ'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమాను పాకిస్తాన్‌లో కూడా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే.. అక్కడి ప్రేక్షకులు సినిమాను చూసి తన్మయత్వంతో పులకించిపోతున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకుల స్పందనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియోలు వైరల్‌గా మారాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే పాకిస్తాన్‌లో హిందూ దేవుడిపై నిర్మించిన సినిమా విడుదల కావడమే విశేషం అయితే, దానికి అద్భుతమైన స్పందన లభించడం మరో విశేషం. ఈ సినిమాకి పాకిస్తాన్‌లో లభిస్తున్న ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది అసలైన విజయం అంటూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.
ముఖ్యంగా కరాచిలోని ఒక థియేటర్‌లో భక్తి భావంతో సినిమాను చూస్తూ దండం పెట్టుకుంటున్నారు. ఇండియాలోనూ చాలా థియేటర్లలో ప్రేక్షకులు భక్తి తన్మయత్వంతో ఊగిపోవడం మనం చూశాం. అయితే పాకిస్తాన్‌లో కూడా ఇదే స్పందన రావడం అందర్నీ షాక్‌కి గురి చేసే అంశమే. సినిమాలోని ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. దాంతో పాకిస్తాన్‌లోనూ ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. హిందు, ముస్లిం అనే తేడా లేకుండా ఒకే భక్తిభావంతో 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని చూడడం అనేది అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



