భారతదేశంలో ఎన్నో పురాతన, శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించాలని, మనశ్శాంతిని పొందాలని ఆయా క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు. అయితే, ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన టాప్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ కర్ణాటకలోని ఒకే ఒక్క ఆలయానికి క్యూ కడుతున్నారు. అదే కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో వెలసిన కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం. ఈ క్షేత్రానికి అంతటి మహత్యం ఎందుకుంది? సెలబ్రిటీలందరూ ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొల్లూరు మూకాంబికా ఆలయానికి సెలబ్రిటీల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి మరియు ప్రముఖ నటుడు దళపతి విజయ్ ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత జ్ఞాని ఇళయరాజా వంటి దిగ్గజాలు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కళలు, విద్య, సంగీతానికి అధిష్టాన దేవతగా భావించే ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది.
ఈ ఆలయానికి అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక సంస్కృతి ఉంది. జగద్గురు
ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.
కొల్లూరు మూకాంబిక ఆలయంలోని మరొక అద్భుతమైన విశేషం ఇక్కడి 'కషాయ ప్రసాదం'. ప్రతిరోజూ రాత్రి పూజ మరియు మంగళహారతి పూర్తయిన తర్వాత భక్తులకు ఒక ప్రత్యేకమైన కషాయాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అల్లం, మిరియాలు, బెల్లం మరియు వివిధ రకాల పవిత్ర మూలికలతో ఈ కషాయాన్ని తయారు చేస్తారు. ఈ కాషాయ ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తే శరీరంలో ఉన్న సమస్త రోగాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.
పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే దివ్యధామం. అందుకే సామాన్య భక్తుల నుండి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు. విద్య, విజ్ఞానం, వృత్తిపరమైన ఎదుగుదల మరియు కెరీర్ సక్సెస్ కోరుకునే వారు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ కొల్లూరు మూకాంబికా ఆలయం.




