Home

»

Latest News

'సింగ్ గీతం' సినిమాపై ఎన్టీఆర్ రివ్యూ.. 94 ఏళ్ళ వయసులో సింగీతం మ్యాజిక్!

Jun 15, 2026 4:36PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక సరికొత్త పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో సంచలనంగా మారింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన 'సింగ్ గీతం' (Sing Geetham) సినిమాను వీక్షించిన తారక్, ఆ చిత్రం తన హృదయాన్ని ఎంతగానో హత్తుకుందని భావోద్వేగంగా స్పందించారు. కేవలం సినిమా బాగుందని చెప్పడమే కాకుండా, చిత్ర యూనిట్ మొత్తాన్ని పేరుపేరునా అభినందిస్తూ ఎన్టీఆర్ చేసిన సుదీర్ఘ ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక అద్భుతమైన సినిమాను వీక్షించిన అనుభూతిని తన అభిమానులతో పంచుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని ఆయన కోరారు.

ఈ వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు కనబరిచిన ప్రతిభను ఎన్టీఆర్ ప్రత్యేకంగా కొనియాడారు. 94 సంవత్సరాల వయసులో లెజెండరీ డైరెక్టర్ సింగీతం గారు తనలోని సృజనాత్మకతను, సినిమా జ్ఞానాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతమని తారక్ ప్రశంసించారు. ఆయన చూపించిన క్రియేటివిటీ, విజ్‌డమ్ తనను ఎంతగానో ప్రేరేపించాయని, ఈ వయసులో కూడా ఆయనలో ఉన్న సినిమా పట్ల ఉన్న కసిని కళ్లారా చూడటం ఒక గొప్ప అనుభూతి అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. సినిమా రంగంలో సరికొత్త ప్రయోగాలు చేయడంలో సింగీతం గారికి ఆయనే సాటి అని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని కొనియాడారు.

ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. "డిఎస్పీ నువ్వు ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని నీ అద్భుతమైన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లావు. సినిమా అంతటా నీ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది." అంటూ తారక్ అభినందించారు. ఈ చిత్రానికి డిఎస్పీ అందించిన ఆడియో సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిందని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

మరోవైపు టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కాంబినేషన్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక దిగ్గజ దర్శకుడి 40 సంవత్సరాల కలని నిజం చేయడం అనేది ఒక దేవుడి ఇచ్చిన వరంగా భావించవచ్చని నాగ్ అశ్విన్‌ను ఉద్దేశించి తారక్ వ్యాఖ్యానించారు. సింగీతం శ్రీనివాసరావు గారి లాంటి మహోన్నత వ్యక్తికి నాగ్ అశ్విన్ మరియు వైజయంతీ మూవీస్ కలిసి ఇచ్చిన ఈ సినిమా ట్రిబ్యూట్ నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ను భుజాన వేసుకుని విజయవంతంగా పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఎన్టీఆర్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

సాధారణంగా సినిమాలకు విడుదల కంటే ముందే ట్రైలర్ వస్తుంటుంది, కానీ సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచినట్లే, ఈ సినిమా విషయంలో కూడా ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారని తారక్ అన్నారు. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను విడుదల చేయడం టాలీవుడ్‌లోనే అతిపెద్ద వినూత్న ప్రయోగం మరియు సర్ప్రైజ్ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ విభిన్నమైన చిత్ర ట్రైలర్‌ను ప్రేక్షకులకు ప్రెజెంట్ చేసే అవకాశం రావడం తనకెంతో గౌరవంగా భావిస్తున్నానని చెబుతూ, అందరూ థియేటర్లకు వెళ్లి ఈ అద్భుతమైన సినిమాను చూసి ఆనందించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com