Home

»

Latest News

Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ బడ్జెట్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. రోజుకు కోటిన్నర ఖర్చు!

Mar 18, 2026

  • జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం భారీ బడ్జెట్ 
  • విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్న మేకర్స్
  • రోజుకు కోటి నుండి కోటిన్నర వరకు ఖర్చు
  • టికెట్ ధరల పెంపు లేకపోతే ఎలా?

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్'(Dragon) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా మేకింగ్, బడ్జెట్ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడటం లేదని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ ఉగాది కానుకగా రేపు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని టికెట్ ధరల పెంపు అంశంపై మాట్లాడుతూ 'డ్రాగన్' మూవీ అప్డేట్ ఇచ్చారు.

విజువల్స్ విషయంలో 'డ్రాగన్' ఒక అద్భుతంలా ఉండబోతోందని నవీన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతిరోజూ దాదాపు కోటి నుండి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ప్రశాంత్ నీల్ విజన్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.

టికెట్ ధరల విషయంలో కూడా నవీన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఫ్లెక్సిబుల్ రేట్లు అందుబాటులో ఉన్నాయని, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అమలు కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాంబే, ఢిల్లీ వంటి నగరాల్లో సినిమాను బట్టి టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఉందని గుర్తు చేశారు.

సంవత్సరానికి వచ్చే ఐదారు భారీ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు అవసరమని, చిన్న సినిమాలకు రేట్లు పెంచాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. వారణాసి, పెద్ది, అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ, ఫౌజీ మరియు ఎన్టీఆర్ డ్రాగన్ వంటి భారీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు, ఆ మేరకు రిటర్న్స్ రావాలంటే టికెట్ రేట్లలో మార్పులు ఉండాలని కోరారు.

త్వరలోనే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించనున్నట్లు నవీన్ తెలిపారు. టికెట్ ధరలపై ఒక శాశ్వత పరిష్కారం వస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వెసులుబాటు కల్పిస్తే ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com