తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ చివరి చిత్రం 'జననాయగన్' విడుదలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇబ్బందులతో ల్యాబ్‌కే పరిమితమైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకూలిస్తే జూన్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా గత జనవరిలోనే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రావాల్సింది. కానీ సినిమాలోని కొన్ని రాజకీయ డైలాగులు, పొలిటికల్ ఎలిమెంట్స్ కారణంగా సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దాదాపు ఆరు నెలలుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఈ తరుణంలో చిత్ర నిర్మాత వెంకట్ నారాయణన్ ఎలాగైనా ఈ సినిమాను వెండితెరపైకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. సెన్సార్ క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయన ప్రస్తుతం ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి క్లియరెన్స్ రాగానే అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఈ చిత్రం టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'భగవంత్ కేసరి'కి పాక్షిక రీమేక్‌గా రూపుదిద్దుకుంది. ఇందులో దళపతి విజయ్ ఐపీఎస్ ఆఫీసర్ వెట్రి కొండన్ పాత్రలో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు. విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, మమితా బైజూ, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేసిన లాస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మధ్యలో ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయినప్పటికీ, థియేటర్లలో దళపతిని సీఎం హోదాలో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 25న సినిమా రిలీజ్ కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఇప్పుడే థియేటర్ల వద్ద హడావుడి మొదలుపెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చే అఫీషియల్ అప్‌డేట్ కోసం కోలీవుడ్ మొత్తం కళ్లప్పగించి చూస్తోంది.





