Home

»

Latest News

Vijay: జననాయగన్ లీక్ కేసులోని నిందితులపై కోర్టు సంచలన నిర్ణయం

Jun 5, 2026 10:50AM

 

ఇళయ దళపతి విజయ్ వన్ మాన్ షో జననాయగన్ రిలీజ్ కి  ముందే ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయల వ్యయంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మించిన ఈ చిత్రం, సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేట్ కూడా రాకముందే లీక్ అవ్వడం చిత్ర పరిశ్రమని  తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భారీ పైరసీ చైన్‌ని  చేధించిన తమిళనాడు స్టేట్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ఇప్పటివరకు సుమారు 16 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు.


 చెన్నైకి చెందిన ఫ్రీలాన్స్ ఎడిటర్ ప్రశాంత్  ఒక ఎడిటింగ్ సూట్‌లో మరో సినిమాని  ఎడిట్ చేసేందుకు యాక్సెస్ పొందాడు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, అక్కడే ఉన్న హార్డ్ డిస్క్ నుండి "జననాయగన్" సినిమా పూర్తి ఫుటేజ్‌ని తన సొంత హార్డ్ డ్రైవ్‌లోకి అక్రమంగా కాపీ చేశాడు. ఆ తర్వాత ఆ ఫుటేజ్‌ని తన సోదరులైన సెల్వం, రాజినిలతో కలిసి వీక్షించాడు. అక్కడితో ఆగకుండా పైరసీ కంటెంట్‌ని  సోషల్ మీడియా వేదికలు, క్లౌడ్ స్టోరేజ్ లింక్‌లు, గూగుల్ డ్రైవ్ ,వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి షేర్ చేసాడు. చివరకి ఈ ఫుటేజ్ తమిళ రాకర్స్, తమిళ మూవీస్ వంటి పైరసీ వెబ్‌సైట్లకు వాణిజ్య ప్రయోజనాల కోసం అమ్ముడుపోయింది. దీనివల్ల చిత్ర నిర్మాణ సంస్థకు కోట్లాది రూపాయల భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

ఈ కేసులో అరెస్టయిన నిందితులలో ముఖ్యులైన ప్రశాంత్, ఎస్. సెల్వం, బాలకృష్ణన్ అలియాస్ బాల అనే ముగ్గురిపై తమిళనాడు ప్రభుత్వం అత్యంత కఠినమైన 'గుండా చట్టం'  కింద కేసు నమోదు చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ విధించింది. కాగా, ఈ కేసులో 40 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న మిగిలిన ఆరుగురు నిందితులు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్లపై జస్టిస్ ఆర్. శక్తివేల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్  బెయిల్ దరఖాస్తులని తీవ్రంగా వ్యతిరేకించారు.

Also read: ritieish deshmukh: నన్ను క్షమించండి... అలా జరగకుండా ఉండాల్సింది

ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ కూడా పొందని ఒక సినిమాని అక్రమంగా దొంగిలించి, ఇంటర్నెట్‌లో విడుదల చేసి లక్షలాది మంది చూసేలా చేయడం అనేది అత్యంత తీవ్రమైన నేరమని ప్రాసిక్యూషన్ కోర్టుకి  వివరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన టెక్స్‌టైల్ షోరూమ్ పర్చేజ్ మేనేజర్ డి. ఉమా శంకర్ ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతని అరెస్ట్ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. రెండు వైపుల వాదనలను విన్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి, డిజిటల్ పైరసీ నెట్‌వర్క్ యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ ఆరుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసారు. ఈ తీర్పుతో చిత్ర పరిశ్రమలో పైరసీకి పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందినట్లయింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com