ఎదిగిన 'చిన్నారి పెళ్లికూతురు'గా నటించాలని ఆశగా ఉందంటున్న అవిక!
on Aug 3, 2021
2008లో వచ్చిన 'బాలికా వధు' హిందీ సీరియల్ బుల్లితెరపై ఓ సంచలనం. దేశవ్యాప్తంగా ఆ సీరియల్‌కు విశేష సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఆ సీరియల్ తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో ప్రసారమై తెలుగువారినీ అమితంగా అలరించింది. చిన్నప్పటి ఆనంది పాత్రతో అవికా గోర్ పాపులర్ అయిపోయింది. అలాగే అవినాశ్ ముఖర్జీ, ప్రత్యూష బెనర్జీ కూడా పాపులర్ అయ్యారు. పదమూడేళ్ల తర్వాత ఈ సీరియల్ కొత్త నటీనటులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది.
ఒరిజినల్లో 'ఆనంది'గా నటించిన అవికా గోర్ ఆ సీరియల్ తన జీవితాన్ని మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. 'చిన్నారి పెళ్లికూతురు 2' (బాలికా వధు 2) గురించి తన ఫీలింగ్స్‌ను పంచుకున్న ఆమె, అందులో ఎదిగిన ఆనంది క్యారెక్టర్‌ను చెయ్యమంటే సంతోషంగా చేస్తానంటోంది. కొత్త సీరియల్లో ఆనంది పాత్రను బాలనటి శ్రేయా పటేల్, జగదీశ్ క్యారెక్టర్‌ను బాలనటుడు వంశ్ సయానీ చేస్తున్నారు.
'చిన్నారి పెళ్లికూతురు' తెచ్చిన ఫేమ్‌తో టాలీవుడ్లో 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది అవిక. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3 సినిమాల్లో నటించింది. లేటెస్ట్ సీరియల్లో ఎదిగిన ఆనందిగా నటించే చాన్స్ వస్తే చేస్తావా? అనే ప్రశ్నకు, "ఓ మై గాడ్! 'బాలికా వధు 2'లో ఎదిగిన ఆనంది పాత్రను చెయ్యమంటే సంతోషంగా చేస్తా. ఒక ఆర్టిస్టుగా ఆ సీరియల్ నాకు చాలా ఇచ్చింది. నిర్మాతలు గనుక ఆ పాత్రను ఆఫర్ చేస్తే, కచ్చితంగా నా కళ్లల్లో నీళ్లు, నా పెదాలపై నవ్వు వస్తాయి. మరో ఆలోచన లేకుండా అందులో భాగం కావాలని కోరుకుంటా. అది చెయ్యడాన్ని ఇష్టపడతాను. కానీ దురదృష్టవశాత్తూ, సౌత్‌లో నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రాక్టికల్‌గా చూస్తే అది సాధ్యంకాదు." అని చెప్పింది అవిక.
'బాలికా వధు 2'లో అవిక నటించకపోవచ్చు కానీ, దానితో అనుసంధానమవుతోంది. ఎలాగంటే.. కొత్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఆ షోకు ఆమె ప్రచారకర్తగా మారుతోంది. ఆగస్ట్ 9న 'బాలికా వధు 2' మొదలు కానున్నది. "కొత్త సీరియల్‌ను చూడమని ప్రజలకు నేను చెప్పబోతున్నాను. 'బాలికా వధు' నా జీవితాన్ని మార్చేసింది. అందుకని, ఈ కొత్త జర్నీకి ఒక చిన్నమార్గంలో భాగం కావాల్సిందిగా నిర్మాతలు నన్ను అడిగినప్పుడు, ఆ అవకాశాన్ని నేను వదులుకోలేదు." అని అవిక తెలిపింది.
త్వరలో ఆమె నాగచైతన్య, రాశీ ఖన్నా జోడీగా నటిస్తోన్న 'థ్యాంక్ యు' మూవీలో ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నది. ఈ మూవీకి విక్రమ్ కుమార్ డైరెక్టర్. అలాగే చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సరసన ఒక సినిమా, 'పాప్‌కార్న్', 'అమరన్' అనే సినిమాలు కూడా ఆమె చేస్తోంది.
Also Read