నేను మళ్లీ పెళ్లి చేసుకోవట్లేదు.. ఆ వెడ్డింగ్ కార్డ్ సినిమాలోనిది!
on Jul 29, 2021
రెండు రోజుల క్రితం సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడంటూ మొత్తం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన పేరుతో వచ్చిన ఒక వెడ్డింగ్ కార్డ్ దీనికి కారణమైంది. ఆ వెడ్డింగ్ కార్డులో ఆయన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు ఉంది. అయితే తాను నిజ జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని సుమంత్ స్పష్టం చేశారు. తాను చేస్తున్న సినిమాకి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ లీకవడం వల్ల, దాన్నిచూసి అందరూ పొరబడ్డారంటూ సుమంత్ వివరణ ఇచ్చారు.
గురువారం రాత్రి ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, "ఈమధ్య నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని న్యూస్ వినిపించింది. దానికి వివరణ ఇస్తున్నా. నిజ జీవితంలో నేను మళ్లీ పెళ్లి చేసుకోవట్లేదు. అయితే, నేనిప్పుడు చేస్తున్న ఓ సినిమా మళ్లీ పెళ్లి ఇతివృత్తంతో తయారవుతోంది. తెలుగు సినిమాలో అలాంటి కథతో సినిమా రావడం బహుశా ఇదే తొలిసారనుకుంటాను. ఆ ఫిల్మ్ షూట్ నుంచి వెడ్డింగ్ కార్డ్ ఫొటో లీకయింది. అది మిస్అండర్స్టాండింగ్కు కారణమైంది. త్వరలోనే ఆ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రాబోతున్నాయి. దాని కోసం నిజంగా ఉద్వేగంతో ఎదురుచూస్తున్నా." అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతకుముందు సుమంత్ రెండో పెళ్లి వార్తలపై రామ్గోపాల్ వర్మ స్పందిస్తూ, "ఒకసారి అయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ" అంటూ ట్వీట్ చేశారు. కాగా 2004లో నటి కీర్తిరెడ్డిని సుమంత్ ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే రెండేళ్లకే ఇద్దరి మధ్య కలతలు చెలరేగి విడిపోయారు. అప్పట్నుంచీ సుమంత్ సింగిల్గానే ఉంటున్నారు.