'తెలిసిన వాళ్ళు' నుంచి హీరో రామ్ ఫస్ట్ లుక్ విడుదల
on Aug 3, 2021
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తెలిసిన వాళ్ళు'. ఈ మూవీకి విప్లవ్ కోనేటినే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కుర్చీలో మొండెం, అద్దంలో తల భాగం కనిపించేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'తెలిసినవాళ్లు' చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్. పెద్ద కాఫీ కప్ లో కూర్చొని ఒక చేతిలో కాఫీ కప్, మరో చేతిలో బిస్కెట్ పట్టుకొని ఉన్న హీరో లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ.. "హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్ కి ఎంతటి ఆదరణ లభించిందో.. అలాగే రామ్ కార్తీక్ లుక్ కి కూడా అంత మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హీరో, హీరోయిన్స్ రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ చాలా బాగా నటించారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న మా సినిమా ఒక సాంగ్ మినహా దాదాపుగా పూర్తయ్యింది. మిగిలిన పది శాతం షూటింగ్ చివరి షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాం" అని అన్నారు.
ఈ సినిమాలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపక్ వేణుగోపాలన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.