Home

»

Latest News

Drishyam 3 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'దృశ్యం 3'.. కానీ తెలుగు వెర్షన్‌కు షాక్!

Jun 18, 2026 3:22PM

మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ "దృశ్యం". మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన "దృశ్యం 3" (Drishyam 3 ) ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఊచకోత కోసిన ఈ క్రైమ్ థ్రిల్లర్, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. 

కేరళలోని ఒక చిన్న గ్రామంలో జార్జ్‌కుట్టి అనే సామాన్య కేబుల్ టీవీ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేసిన ఎత్తులు, పైఎత్తులతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు మూడో భాగంతో సరికొత్త మలుపు తిరిగింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినిమా లవర్స్‌కు ఇది నిజంగానే అదిరిపోయే వీకెండ్ ట్రీట్ అని చెప్పాలి.

ఈ క్రేజీ సీక్వెల్ థియేట్రికల్ రన్ విషయానికి వస్తే, మే 21న మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రికార్డులను సృష్టించింది. రూ. 240 కోట్ల గ్రాస్ తో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో 7.0 ఐఎండిబి రేటింగ్‌తో దూసుకుపోయిన ఈ సినిమా కోసం ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే, డిజిటల్ రిలీజ్ వేళ తెలుగు ప్రేక్షకులకు ఒక షాక్ తగిలింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 18 నుండి ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలకు మాత్రం బ్రేక్ పడింది. దృశ్యం ఫ్రాంచైజీ తెలుగు రీమేక్ హక్కులకు సంబంధించి నటి, దర్శకురాలు శ్రీప్రియకు చెందిన రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తెలుగు రైట్స్ వివాదంపై విచారణ జరిపిన కోర్టు, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీ విడుదలను నిలిపివేస్తూ తాత్కాలిక స్టే విధించింది. దీనివల్ల ప్రస్తుతానికి తెలుగు ఆడియన్స్ మలయాళం లేదా ఇతర భాషల వెర్షన్లను సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి వస్తోంది.

కథ పరంగా చూస్తే, వరుణ్ హత్య జరిగి దాదాపు 13 ఏళ్లు గడిచినా జార్జ్‌కుట్టి కుటుంబాన్ని గతం వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు, అసలైన మాస్టర్‌మైండ్స్ జార్జ్‌కుట్టి నిర్మించుకున్న పటిష్టమైన రక్షణ వలయాన్ని ఛేదించడానికి సరికొత్త వ్యూహాలతో వస్తారు. మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిక్ వంటి పాత తారాగణంతో పాటు ఆశా శరత్, మురళీ గోపీ కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. 2 గంటల 36 నిమిషాల నిడివి గల ఈ సస్పెన్స్ డ్రామాలో జార్జ్‌కుట్టి తన తెలివితేటలతో చట్టాన్ని, పోలీసులను ఎలా ఎదుర్కొన్నాడనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మూవీ ఖచ్చితంగా ఒక బెస్ట్ వాచ్ ఆప్షన్.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com