మిగతా పదవులకు మీ ఇష్టం.. ప్రధాన కార్యదర్శిగా మాత్రం నన్ను గెలిపించండి!
on Sep 25, 2021
మరికొద్ది రోజుల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధాలు, ప్లేట్ల ఫిరాయింపులు, విందు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒక వర్గం వారు.. గతంలో మీరేం చేశారంటే.. మరో వర్గం వారు.. మీరేం చేశారంటూ ఒక వర్గంపై మరోవర్గం ప్రశ్నల బాణాలు సంధించుకుంటున్నారు.
తాజాగా ‘మా’లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ‘మా’లోని సభ్యుల టెంపరేచర్ పెరిగిపోతోంది. దీంతో ప్రచార మార్గాన్ని ఒక్కొక్కరు ఒక్క మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అందులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వినూత్న ప్రచారానికి తెర తీశారు. అందులో కూడా ఆయన ట్విట్టర్‌ను వేదికగా ఎంచుకున్నారు.
ట్విట్టర్లో ఓ పోస్టర్ షేర్ చేసి.. "ఒకే ఒక్క ఓటు, మా కోసం, మన కోసం, మనందరి కోసం, మా తరపున ప్రశ్నించడం కోసం.." అని తాను చెప్పదలచుకున్నది క్లిస్టర్ క్లియర్‌గా అందులో స్పష్టం చేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శితోపాటు కార్యనిర్వాహక సభ్యులుగా మీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోండి. కానీ, ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ)గా నన్ను మాత్రం గెలిపించండి అని మా సభ్యులను బండ్ల గణేశ్ అభ్యర్థించారు. టాలీవుడ్‌లోని అగ్ర, యువ నటీనటులను ట్యాగ్ చేస్తూ బండ్ల గణేశ్ ఈ ట్వీట్ పెట్టారు.
ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన ‘సినిమా బిడ్డలం’ ప్యానల్లో బండ్ల గణేశ్ సభ్యుడిగా కొన్నాళ్లు కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రకాశ్ రాజ్ తన వర్గంలోకి జీవితా రాజశేఖర్‌ను తీసుకోవడాన్ని బండ్ల గణేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వర్గం నుంచి బండ్ల గణేశ్ బయటకు వచ్చి.. జీవితా రాజశేఖర్‌పై పోటీ చేయాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యదర్శి పదవి కోసం తాను ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు బండ్ల గణేశ్ ప్రకటించిన విషయం విధితమే. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నాయి.
Also Read