
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో 2023లో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ఎప్పుడు పనిచేస్తారా అని అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ-అనిల్ రావిపూడి మరోసారి జట్టు కట్టబోతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి సాధారణంగా ఏడాదికి ఒక సినిమా చేస్తూ, నిర్మాతలకు భారీ లాభాలు చేకూర్చడంలో సిద్ధహస్తుడు. ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాను విడుదల చేస్తూ సక్సెస్ లు కొడుతున్నాడు. 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం', 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు. 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్ ల మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇక 2028 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే చిత్రం ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణతోనే ఉంటుందని, దీనికి సంబంధించి దాదాపుగా ఒప్పందాలు ఖరారయ్యాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్, ఆ తర్వాత కొరటాల శివతో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు.
మలినేని సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా, కొరటాల శివ ప్రాజెక్టు 2027 వేసవి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ సమయానికి అనిల్ రావిపూడి కూడా స్క్రిప్ట్ ను రెడీ చేసుకొని, బాలకృష్ణ సినిమా కోసం సిద్ధంగా ఉంటారని సమాచారం.
ఇక ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. అనిల్ రావిపూడితో మంచి అనుబంధం ఉన్న సాహు గారపాటి లేదా దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్టును నిర్మించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గోపీచంద్ మలినేని, కొరటాల శివ సినిమాల తర్వాత, అనిల్ రావిపూడి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటం నందమూరి అభిమానులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేమికులు, ఫ్యాన్స్ ఆత్రుతగా వేచి చూస్తున్నారు.
Balakrishna, Anil Ravipudi, NBK 113, TeluguOne






