ఒకే రోజున ఆర్య రెండు చిత్రాలు రిలీజ్!
on Sep 17, 2021
ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ ఆర్యకి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. తక్కువ గ్యాప్ లో ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్ అయిన `టెడ్డీ`, `సర్పట్టా పరంపరై` చిత్రాలు అతణ్ణి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చాయి. వేర్వేరు జానర్స్ లో రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా నటుడిగా ఆర్యకి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఒకవైపు ఈ విజయాలను ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రాలతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఆర్య నుంచి రాబోతున్న ఈ రెండు కొత్త చిత్రాలు కూడా ఒకే రోజున థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. తన మిత్రుడు, యాక్షన్ హీరో విశాల్ తో కలిసి ఆర్య నటించిన `ఎనిమీ` దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. కట్ చేస్తే.. అదే రోజున ఆర్య సోలో హీరోగా నటించిన `అరణ్మనై 3` కూడా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండు సినిమాల ఫలితాలు ఆర్యకి కీలకంగా మారాయి. మరి.. ఆర్య దసరా డబుల్ ధమాకా.. ఆడియన్స్ ని ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.
కాగా `అరణ్మనై 3`కి సుందర్. సి దర్శకత్వం వహించగా.. `ఎనిమీ`ని ఆనంద్ శంకర్ రూపొందించారు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులోనూ అనువాదం కానున్నాయి.