బాబోయ్ 'అన్నాబెల్లే సేతుపతి'!
on Sep 17, 2021
విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం 'అన్నాబెల్లే సేతుపతి' కోసం ఆడియెన్స్ క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. ఎట్టకేలకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ఈరోజు (సెప్టెంబర్ 17)న ఈ సినిమా మన ముందుకు వచ్చింది. లాజిక్‌లేని సన్నివేశాలతో సినిమా చూస్తున్నంత సేపూ ఫ్రస్ట్రేషన్ కలిగించిందని జనం అంటున్నారు. రివ్యూస్ కూడా అలాగే ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ ప్యాలెస్‌లో కొన్ని దెయ్యాలు బంధింపబడి ఉంటాయి. అయితే అవి ఎందుకు ఆ బంగళాలో ఉంటాయనే దానికి సరైన లాజిక్ ఇవ్వలేదు దర్శకుడు. అర్థంపర్థం లేని కథను చేయడానికి విజయ్ సేతుపతి ఎలా అంగీకరించాడని ఆడియెన్స్ అంటున్నారు.
భూత్ బంగ్లాలు, పునర్జన్మలు, ఆత్మలను మనం ఇప్పటికి ఎన్ని సినిమాల్లో చూసుంటాం! 1940లలో చనిపోయిన ఓ బ్రిటీష్ అమ్మాయి (తాప్సీ పన్ను) మళ్లీ పుట్టి ఆ బంగ్లాలోకి వచ్చి, అందులోని దెయ్యాలను ఎలా ఎదుర్కొందనేది ఇందులో చూస్తాం. ఆ బంగ్లా ఎవరు కట్టించారంటే.. పూర్వ జన్మలోని ఆమె కోసమే ఒక రాజు (విజయ్ సేతుపతి) దాన్ని కట్టించాడంట! ఆ దెయ్యాలను ఆమె తప్ప ఇంకెవరూ చూడలేరు. చిత్రమేమంటే పూర్వజన్మలోని బ్రిటీష్ యువతిగా కూడా తాప్సీ కనిపించడం!
విజయ్ సేతుపతి మనకు సెకండాఫ్‌లో దర్శనమిస్తాడు.. అదీ కూడా ఎక్కువగా ఉత్తర భారతావనికి చెందిన పెళ్లికొడుకు వేషంలో! 1940ల కాలానికి సంబంధించిన కథ చెప్పేటప్పుడు ఆనాటి కాలానికి చెందిన కాస్ట్యూమ్స్‌లోనే అందరూ కనిపించాలి కదా. ఈ విషయంలో దర్శకుడు శ్రద్ధ చూపించలేదు. నిర్మాణ విలువలు మరీ నాసిరకంగా ఉన్నాయి. కత్తులు నకిలీవని స్పష్టంగా తెలిసిపోతోంది. చాలామంది పాత్రధారుల నటన పేలవంగా ఉంది.
హారర్ కామెడీ అని చెప్పారు కానీ.. సినిమాలో కనిపించనిది హారరే! విజయ్, తాప్సీ మధ్య రొమాంటిక్ సీన్లు వారి నటన కారణంగా బాగున్నాయి. చేజింగ్ సీన్స్ ఎంత అర్థరహితంగా కనిపించాయో, స్లాప్స్టిక్ కామెడీ అంత అపహాస్యం అనిపించింది. కిరాతకుడైన విలన్‌గా జగపతిబాబు తనదైన శైలి నటన చూపించారు. 'అన్నాబెల్లే సేతుపతి' సినిమాని చూడకపోవడం వల్ల ప్రేక్షకులకు లాభమే తప్ప నష్టం ఉండదనేది విమర్శకుల మాట. ఆపై మీ ఇష్టం! మీ కష్టం!!