ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. 'పుష్ప' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించిన బన్నీ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకోబోతున్నారు. తన అభిరుచికి తగ్గట్టుగా హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లో ఓ భారీ రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు.
సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ విలాసవంతమైన మ్యాన్షన్‌కు 'బ్లెసింగ్' (Blessing) అని పేరు పెట్టారు. సుమారు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఇంటి గృహప్రవేశానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విశేషమేమిటంటే, ఈ కొత్త ఇల్లు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి చాలా దగ్గరలోనే ఉండటం మెగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ఇంటి నిర్మాణం వెనుక బన్నీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ అమీర్ శర్మ పర్యవేక్షణలో గ్లోబల్ స్టాండర్డ్స్‌తో, మినిమలిస్ట్ వైట్ థీమ్‌తో ఈ భవనం రూపుదిద్దుకుంటోంది. ఇందులో అత్యాధునిక స్విమ్మింగ్ పూల్, స్పెషల్ ఆఫీస్ స్పేస్, పిల్లల కోసం ప్లే ఏరియాతో పాటు ఇంటర్నేషనల్ లుక్‌తో కూడిన ఇంటీరియర్స్ ఉండబోతున్నాయి. ఈ ఏడాది చివరలో బన్నీ తన కుటుంబంతో కలిసి ఈ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు.
మరోవైపు, అల్లు అర్జున్ ముంబైకి మకాం మారుస్తున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. బన్నీ శాశ్వతంగా ముంబై వెళ్లడం లేదని, కేవలం తన తదుపరి భారీ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ కోసం అక్కడ తాత్కాలికంగా అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బన్నీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో రాబోతున్న 'రాకా' సినిమాతో పాటు, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉంది. ఈ సినిమాల చిత్రీకరణ అధిక భాగం ముంబైలో జరగనుండటంతో, రాకపోకల ఇబ్బంది లేకుండా ఉండటానికే అక్కడ నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బన్నీ శాశ్వత చిరునామా మాత్రం హైదరాబాద్‌లోని 'బ్లెసింగ్' మాత్రమేనని స్పష్టమైంది.






