వెంకీ.. మరో రీమేక్?
on May 4, 2021
రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టాలీవుడ్ స్టార్స్ లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన `చంటి`తో సహా పలు విజయవంతమైన చిత్రాలు.. రీమేక్సేనే కావడం గమనార్హం. అంతేకాదు.. విడుదలకు సిద్ధమైన `నారప్ప`, `దృశ్యం 2` కూడా రీమేక్ సినిమాలే. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `అసురన్` ఆధారంగా `నారప్ప` రూపొందితే.. మాలీవుడ్ ఓటీటీ సెన్సేషన్ `దృశ్యం 2` ఆధారంగా `దృశ్యం 2` తెరకెక్కింది.
కట్ చేస్తే.. తాజాగా వెంకీ మరో రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. ఒకటిన్నర సంవత్సరం క్రితం మలయాళ చిత్ర సీమలో సంచనలం సృష్టించిన చిత్రం `డ్రైవింగ్ లైసెన్స్`. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ డ్రామాని లాల్ జూనియర్ తెరకెక్కించారు. 2019 క్రిస్మస్ సందర్భంగా విడుదలైన `డ్రైవింగ్ లైసెన్స్` ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు కొన్నాళ్ళ క్రితం వార్తలు వచ్చినా.. ఎందుకనో కార్యరూపం దాల్చలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. త్వరలోనే ఈ రీమేక్ పట్టాలెక్కనుందట. ఒరిజినల్ లో సూరజ్ పోషించిన మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ రోల్ లో వెంకీ దర్శనమివ్వనుండగా.. అతని ఆరాధ్య నటుడిగా పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ రీమేక్ ని నిర్మించే అవకాశముందంటూ ప్రచారం సాగుతోంది. త్వరలోనే `డ్రైవింగ్ లైసెన్స్` తెలుగు రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.