ఫస్ట్ టైమ్: శివకార్తికేయన్ సినిమాకి `యు/ఎ` సర్టిఫికేట్
on May 15, 2021
తెలుగులో నేచురల్ స్టార్ నాని ఎలాగైతే ఆబాలగోపాలాన్ని అలరించేలా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతారో.. అదే తరహాలో కోలీవుడ్ యూత్ స్టార్ శివకార్తికేయన్ కూడా తమిళనాట తన చిత్రాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. ఎలాంటి సబ్జెక్ట్ తో శివకార్తికేయన్ సినిమా తెరకెక్కినా సెన్సార్ నుంచి `యు` సర్టిఫికేట్ పక్కా. అయితే, ఇదంతా నిన్నటి మాట. విడుదలకు సిద్ధమైన శివ కొత్త చిత్రంతో ఆ లెక్క కాస్త మారింది. `యు` సర్టిఫికేట్ నుంచి `యు/ఎ` సర్టిఫికేట్ వైపుగా శివకార్తికేయన్ జర్నీ టర్న్ అయింది.
కాస్త వివరాల్లోకి వెళితే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన తమిళ సినిమా `డాక్టర్`. `గ్యాంగ్ లీడర్`, `శ్రీకారం` చిత్రాల కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటించిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాగా, యాక్షన్ సీన్స్ లో హింసకు బాగానే చోటివ్వడంతో.. `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసిందట సెన్సార్ కమిటీ. ఈ నేపథ్యంలోనే.. కథానాయకుడిగా శివకార్తికేయన్ ఖాతాలో తొలి `యు/ఎ` సర్టిఫికేట్ మూవీ చేరిందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి కోలీవుడ్ వర్గాలు.
ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గాక `డాక్టర్` రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.