నటుడిగా మారిన రాఘవేంద్రరావు.. ఫస్ట్ లుక్ వదిలిన రాజమౌళి
on Jul 30, 2021
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. వందకిపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా వస్తున్న చిత్రం 'పెళ్లిసందD'లో నటుడిగా కనువిందు చేయనున్నారు.
గతంలో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లిసందడి' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరి రోణంకి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దర్శకేంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. వశిష్ట అనే పాత్రలో ఆయన సందడి చేయనున్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ రాఘవేంద్రరావు పాత్రకి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు దర్శకధీరుడు రాజమౌళి. వందకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత.. మన మౌనముని కెమెరా ముందుకు వచ్చారు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు సూట్ ధరించి, కళ్లజోడు పెట్టుకుని, బాస్కెట్ బాల్ పట్టుకుని స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చారు.