మోహన్ లాల్ వర్సెస్ ఫాహద్ ఫాజిల్
on Mar 5, 2021
2021 మే 13.. మలయాళ చిత్ర సీమలో ఆసక్తికరమైన పోటీకి వేదిక కానుంది. ఆ రోజు.. వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు స్టార్స్ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, వెర్సటైల్ స్టార్ ఫాహద్ ఫాజిల్.
ఆ వివరాల్లోకి వెళితే.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మోహన్ లాల్, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేశ్, కళ్యాణి ప్రియదర్శన్, సుహాసిని వంటి భారీ తారాగణంతో దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన `మరక్కర్.. అరబిక్ కడలింటే సింహం` వేసవి కానుకగా మే 13న విడుదలకు సిద్ధమైంది. కట్ చేస్తే.. అదే రోజు ఫాహద్ ఫాజిల్ కథానాయకుడిగా రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు మహేశ్ నారాయణ్ రూ.27 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన పొలిటికల్ యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ `మాలిక్` రిలీజ్ కాబోతోంది. దీంతో.. మోహన్ లాల్, ఫాహద్ ఫాజిల్ మధ్య సాగనున్న ఈ పోటీ కేరళనాట ఎంతో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఫాహద్ ఫాజిల్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఫాజిల్ రూపకల్పనలో వచ్చిన `మణిచిత్రత్తాళ్` (`చంద్రముఖి`కి మాతృక)తో సహా పలు చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు. అంతేకాదు.. `మరక్కర్`లో ఫాజిల్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుండడం విశేషం.
మరి.. ఈ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ వార్ లో ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుందో తెలియాలంటే మే 13 వరకు వేచిచూడాల్సిందే.