సాయితేజ్ `సుప్రీమ్`కి ఐదేళ్ళు
on May 5, 2021
స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజుకి వేసవి సీజన్ తో మంచి అనుబంధమే ఉంది. తన తొలి చిత్రం `దిల్` నుండి తాజా చిత్రం `వకీల్ సాబ్` వరకు సమ్మర్ సీజన్ లో వచ్చిన పలు సినిమాలు విజయపథంలో
పయనించాయి. వాటిలో `సుప్రీమ్` ఒకటి. `పటాస్` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి ద్వితీయ చిత్రమిది. మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా కనువిందు చేసింది. మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, రవికిషన్, మురళీ మోహన్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా.. `పటాస్` ఫేమ్ శ్రుతి సోథి స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
సాయి కార్తిక్ సంగీతసారథ్యంలో రూపొందిన గీతాల్లో ``అందం హిందోళం`` (`యముడికి మొగుడు` సినిమా కోసం రాజ్ - కోటి స్వరపరిచిన పాటకి రీమిక్స్), ``బెల్లం శ్రీదేవి`` అలరించాయి. 2016 మే 5న
విడుదలైన `సుప్రీమ్` నేటితో ఐదు వసంతాలను పూర్తిచేసుకుంది.