`రౌడీ అల్లుడు`గా చిరంజీవి రంజింపజేసి నేటికి 30 ఏళ్ళు!
on Oct 18, 2021
మెగాస్టార్ చిరంజీవి - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. వాటిలో `రౌడీ అల్లుడు` ఒకటి. ఇందులో ముంబై బేస్డ్ ఆటో డ్రైవర్ జానిగా, ఇండస్ట్రీయలిస్ట్ కళ్యాణ్ గా ద్విపాత్రాభినయం చేశారు చిరు. రెండు పాత్రలకూ తనదైన టచ్ ఇచ్చి క్లాస్, మాస్ ఆడియన్స్ ని రంజింపజేశారాయన. చిరంజీవికి జంటగా దివ్యభారతి, శోభన నటించిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, కెప్టెన్ రాజు, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, జేవీ సోమయాజులు, ఐరెన్ లెగ్ శాస్త్రి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. డిస్కో శాంతి ప్రత్యేక గీతంలో చిందులేశారు.
బప్పీలహరి బాణీలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువనచంద్ర సాహిత్యమందించారు. ``చిలుకా క్షేమమా``, ``లవ్ మీ మై హీరో``, ``అమలాపురం బుల్లోడా``, ``ప్రేమా గీమా``, ``కోరి కోరి కాలుతోంది``, ``తద్దినక తప్పదిక``.. ఇలా ఇందులోని గీతాలన్ని ఉర్రూతలూగించాయి. జి. సత్యమూర్తి రచన, కె.యస్. హరి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అదనపు బలంగా నిలిచాయి. శ్రీ సాయి రామ్ ఆర్ట్స్ పతాకంపై కె. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. 1991 అక్టోబర్ 18న విడుదలై ఘనవిజయం సాధించిన `రౌడీ అల్లుడు`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read