పాతికేళ్ళ `వినోదం`
on Aug 2, 2021
కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. అలా.. ఆయన రూపొందించిన సినిమాల్లో `వినోదం` ఒకటి. టైటిల్ కి తగ్గట్టే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో.. `పెళ్ళిసందడి` (1996)లో జోడీగా కనువిందు చేసిన శ్రీకాంత్, రవళి మరోసారి జంటగా సందడి చేశారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ళ భరణి, ఉత్తేజ్, శివాజీరాజా, బండ్ల గణేశ్, ఏవీయస్, వై.విజయ, మల్లికార్జున రావు, రాళ్ళపల్లి, గుండు హనుమంతరావు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
గొప్పింటి అమ్మాయి అష్టలక్ష్మి(రవళి)ని ప్రేమించిన రాజా (శ్రీకాంత్) అనే యువకుడు.. అష్టలక్ష్మి తండ్రి బంగారం (కోట)ని పెళ్ళికి ఎలా ఒప్పించాడు? అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. సింపుల్ పాయింట్ చుట్టూ తిరిగే ఈ చిత్రాన్ని వీనులవిందైన పాటలతో, ఆరోగ్యకరమైన హాస్యంతో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన విధానం జననీరాజనాలు అందుకుంది.
ఇక ఎస్వీ కృష్ణారెడ్డి అందించిన పాటల విషయానికి వస్తే.. ఇందులో ఉన్న ఐదు గీతాలు కూడా అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ``మల్లెపూల వాన``, ``హాయ్ లైలా``, ``చలాకీ కలువ``, ``జింగిలాలో``, ``కమ్మగా సాగే స్వరమో``.. ఇలా పాటలన్నీ ఆకట్టుకున్నాయి. అసలు డైలాగులే లేకుండా దొంగ పాత్రలో వినోదాలు పంచిన బ్రహ్మానందంకి ఈ చిత్రానికి గానూ `ఉత్తమ హాస్య నటుడు`గా `నంది` పురస్కారం దక్కింది. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించిన `వినోదం`.. 1996 ఆగస్టు 2న విడుదలై ప్రజాదరణ పొందింది. నేటితో ఈ హాస్యభరిత చిత్రం 25 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read