మెగాస్టార్ `ఠాగూర్`కి 18 ఏళ్ళు!
on Sep 24, 2021
మెగాస్టార్ చిరంజీవి పలు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లో అలరించారు. వాటిలో 2003 నాటి `ఠాగూర్` ఒకటి. `ఇంద్ర` (2002) వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత చిరు నుంచి వచ్చిన ఈ సినిమా కూడా.. పలు రికార్డులకు చిరునామాగా నిలిచింది. తమిళ చిత్రం `రమణ` (2002) ఆధారంగా స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ రూపొందించిన ఈ సినిమాలో లంచగొండి వ్యవస్థపై పోరాటం చేసిన ప్రొఫెసర్ ఠాగూర్ గా తన నటనతో మెస్మరైజ్ చేశారు మెగాస్టార్. ఇందులో చిరుకి జంటగా శ్రియ, జ్యోతిక నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో షాయాజీ షిండే, ప్రకాశ్ రాజ్, పునీత్ ఇస్సార్, సునీల్, కోట శ్రీనివాసరావు, కె. విశ్వనాథ్, రమాప్రభ, వేణు మాధవ్, రాజా రవీంద్ర, ఉత్తేజ్, మాస్టర్ తేజ అలరించారు. అతిథి పాత్రలో చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ దర్శనమిచ్చారు.
మెలోడీబ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `ఠాగూర్`కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటల్లో ``చిన్నగా చిన్నగా``, ``కొడితే కొట్టాలిరా`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``వానొచ్చెనంటే``, ``గప్పుచిప్పు``, ``మన్మథా మన్మథా``, ``నేను సైతం`` కూడా ఆకట్టుకున్నాయి. అలాగే ``నేను సైతం`` గీతానికిగానూ `ఉత్తమ పాటల రచయిత`గా సుద్దాల అశోక్ తేజ జాతీయ పురస్కారం అందుకున్నారు. లియో ప్రాజెక్ట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2003 సెప్టెంబర్ 24న విడుదలై అఖండ విజయం సాధించిన `ఠాగూర్`.. నేటితో 18 వసంతాలు పూర్తిచేసుకుంది.