'తులసి'గా వెంకీ మెస్మరైజ్ చేసి నేటికి 14 ఏళ్ళు!
on Oct 12, 2021
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రాలు.. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కి భలేగా కలిసొచ్చాయి. వాటిలో.. `తులసి` ఒకటి. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పర్వతనేని తులసీరామ్ గా టైటిల్ రోల్ లో తనదైన అభినయంతో మెస్మరైజ్ చేశారు వెంకీ. మరీముఖ్యంగా.. చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వెంకీకి జంటగా నయనతార నటించిన ఈ సినిమాలో మాస్టర్ అతులిత్, రమ్యకృష్ణ, శివాజీ, ఆశిష్ విద్యార్ధి, రాహుల్ దేవ్, విజయ్ కుమార్, అలీ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, జయప్రకాశ్ రెడ్డి, ఝాన్సీ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, రవి బాబు, తనికెళ్ళ భరణి, ఉత్తేజ్, శివ పార్వతి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా.. అందాల తార శ్రియ ఓ ప్రత్యేక గీతంలో చిందులేశారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలకు చంద్రబోస్, భాస్కరభట్ల, సాహితి సాహిత్యమందించారు. పాటల్లో ``నీ కళ్ళతోటి`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``వెన్నెలింత వేడిగా``, ``తుల తుల తులసి``, ``నే చుక్ చుక్ బండిని`` గీతాలు కూడా రంజింపజేశాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా.. 225 కేంద్రాల్లో నేరుగా అర్ధశతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2007 అక్టోబర్ 12న విడుదలై ఘనవిజయం సాధించిన `తులసి`.. నేటితో 14 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read