
- జైలర్ 2 నుంచి షారుఖ్ ఖాన్ అవుట్?
- బాలీవుడ్ ‘బాద్ షా’ నో చెప్పడానికి అసలు కారణం ఇదే!
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’(Jailer 2)పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒక పవర్ఫుల్ కేమియో రోల్ చేయబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రజనీ-షారుఖ్ కాంబో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పెద్ద షాక్ అని చెప్పాలి.
నిజానికి షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో నటించడానికి మొదట చాలా ఆసక్తి చూపించారట. నెల్సన్ రాసుకున్న పాత్ర ఆయనకు కూడా బాగా నచ్చిందని సమాచారం. కానీ, తన అప్‌కమింగ్ మూవీ ‘కింగ్’ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. తన కూతురు సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రం చేస్తున్న ‘కింగ్’ సినిమా షారుఖ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆ సినిమాలో తన లుక్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటుందని, అది బయటకు రాకముందే వేరే సినిమాలో కనిపించడం ఇష్టం లేకనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
‘జైలర్ 2’ ఆగస్టు 2026లో విడుదలయ్యే అవకాశం ఉండగా, షారుఖ్ ‘కింగ్’ డిసెంబర్లో రాబోతుంది. ఒకవేళ ‘జైలర్ 2’లో కామియో చేస్తే, ‘కింగ్’ కంటే ముందే తన లుక్ రివీల్ అవుతుంది. అందుకే షారుఖ్ రజనీకాంత్ తో పాటు ‘జైలర్ 2’ మేకర్స్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇద్దరు లెజెండరీ స్టార్లను ఒకే స్క్రీన్ మీద చూడాలనుకున్న సినీ ప్రేమికులకు నిరాశ తప్పడం లేదు.

నిజానికి ‘జైలర్ 2’లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కూడా ఒక పవర్ఫుల్ కేమియో రోల్ చేయబోతున్నారనే వార్త తెగ చక్కర్లు కొట్టింది. అయితే బాలయ్య హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉండటం, కేమియో రోల్స్ చేయడానికి ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో ఆయన ‘జైలర్ 2’కి ఓకే చెప్పలేదు. ఇక ఇప్పుడు షారుఖ్ కూడా బాలయ్య బాటలోనే పయనిస్తూ ‘జైలర్ 2’కి షాకిచ్చారు.
బాలయ్య, షారుఖ్ వంటి స్టార్స్ లేకపోయినా.. మొదటి భాగంలో ఉన్న మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ సీక్వెల్ లో కూడా మెరవబోతున్నారు. ‘జైలర్ 2’ గురించి రజనీకాంత్ రీసెంట్గా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.




