Home

»

Latest News

విశ్వంభర, పెద్ది రిలీజ్ వాయిదా వెనుక అసలు రీజ‌న్‌ ఇదేనా?

Apr 10, 2026


 

- వీఎఫ్ఎక్స్ విషయంలో మెగాస్టార్ కఠిన నిర్ణయం

- క్వాలిటీ కోసం వెనక్కి తగ్గిన మెగా హీరోలు 

- వాయిదా బాటలో భారీ చిత్రాలు

మెగా అభిమానులకు ప్రస్తుతం ఒకటే టెన్షన్. తమ అభిమాన హీరోల సినిమాలు అనౌన్స్ అయి నెలలు గడుస్తున్నా, షూటింగులు పూర్తి చేసుకున్నా రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర, రామ్‌చ‌ర‌ణ్ పెద్ది
విడుదల తేదీల చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ రెండు సినిమాల జాప్యానికి ప్రధాన కారణం టెక్నికల్ సమస్యలు, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యత అని ఫిల్మ్ నగర్ టాక్. విశ్వంభ‌ర చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఇక రామ్‌చ‌ర‌ణ్ పెద్దికి మొద‌ట మార్చి 27 రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. ఆ త‌ర్వాత ఏప్రిల్ 30కి మార్చారు. ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్న మాటేమిటంటే.. ఈ చిత్రం జూన్‌కి వెళ్లిపోయింది. ఈ రెండు సినిమాల‌ను విఎఫ్ఎక్స్ స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయ‌న్న‌ది సినీ వ‌ర్గాల్లో ఉన్న అభిప్రాయం. 

గతంలో 'విశ్వంభర' టీజర్ విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో విజువల్స్ పట్ల కొంత మిశ్రమ స్పందన వచ్చింది. గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదని కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. దీంతో అప్రమత్తమైన మెగాస్టార్ మరియు దర్శకుడు వశిష్ట, అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. దాదాపు ఐదారు కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ పనులు మళ్ళీ మొదటి నుంచి చేయిస్తున్నట్లు సమాచారం. ఈ రీ-వర్క్ కారణంగానే సినిమా విడుదల తేదీ ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.

మరోవైపు  'పెద్ది' పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ దశలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారాయట. రాజమౌళి వంటి దర్శకులు ఇండియన్ సినిమాను వీఎఫ్ఎక్స్ పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న తరుణంలో, చిన్న పొరపాటు జరిగినా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే క్వాలిటీ కోసం మరికొంత సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ, పక్కాగా రావాలని పట్టుబడుతున్నారు.

వాస్తవానికి మెగా ఫ్యామిలీకి వీఎఫ్ఎక్స్ సమస్యలు కొత్తేమీ కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  'హరిహర వీరమల్లుస చిత్రానికి కూడా వీఎఫ్ఎక్స్‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర'కు కూడా అదే పరిస్థితి ఎదురుకావడం మెగా ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆలస్యంపై విభిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. "లేటైనా లేటెస్ట్‌గా రావాలి" అని కొందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తుంటే, "ముందే పక్కా ప్లానింగ్‌తో ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు కదా" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలైనప్పుడు టెక్నికల్ టీమ్స్‌ను ముందే సరిగ్గా ఎంచుకోవాలని సినీ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు.

ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి తన 'విశ్వంభర'తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని కంకణం కట్టుకున్నారు. గతంలో 'బింబిసార'తో మెప్పించిన వశిష్ట, ఈసారి చిరు కోసం అంతకు మించి అద్భుతమైన విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇక 'పెద్ది' టీమ్ కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో రావాల్సిన సినిమాలు కాస్త అటు ఇటుగా మారినా, వెండితెరపై విజువల్ ఫీస్ట్ మాత్రం పక్కా అని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ వీఎఫ్ఎక్స్ అడ్డంకులను దాటుకుని మెగా హీరోలు ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తారో వేచి చూడాలి!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com