
- మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- జూలై సెంటిమెంట్‌తో రాబోతున్న ‘విశ్వంభర’
- మెగాస్టార్ ఖాతాలో మరో ఇంద్ర?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఒక క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన విశ్వంభర.. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ విజువల్ వండర్‌ను జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ జూలైలోనే విడుదలై రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ‘విశ్వంభర’ను కూడా జూలైలో తీసుకురావాలని యూవీ క్రియేషన్స్ భావిస్తోంది.
టీజర్ విడుదలైనప్పుడు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని, గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడకూడదని చిరు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్ కోసం టాప్ VFX స్టూడియోలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.

చిరంజీవి ఏడు లోకాలకు ప్రయాణించే అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు, బలమైన అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో హైలైట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష (Trisha) నటిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడం విశేషం. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాల తర్వాత చిరంజీవి చేస్తున్న అటెంప్ట్ కావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా వశిష్ట తన మొదటి సినిమా ‘బింబిసార’తోనే సత్తా చాటాడు. ఇప్పుడు చిరంజీవి లాంటి బడా హీరోతో కలిసి ఆయన సృష్టిస్తున్న ‘విశ్వంభర’ లోకం ఏ రేంజ్లో ఉంటుందోనని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
త్వరలోనే రిలీజ్ డేట్ తో కూడిన ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న చిరంజీవి.. ‘విశ్వంభర’తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుని, రికార్డులు సృష్టిస్తారేమో చూడాలి.





